న్యూఢిల్లీ: సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ)ను గాడిలో పడేసేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) నియమించిన అడ్హాక్ కమిటీ బాధ్యతలు స్వీకరించింది. కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు ఐవోఏ ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ..ఓవైపు డబ్ల్యూఎఫ్ఐ వ్యవహారాలను పరిశీలిస్తూనే 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించేలా పనిచేయనుంది.
గత నెలలో ఏర్పాటైన ఈ కమిటీలో భూపిందర్‌సింగ్ భాజ్వా, సుమా షిరూర్ సభ్యులుగా ఉన్నారు. ‘ఈ రోజు (గురువారం) డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాల నిర్వహణ కోసం బాధ్యతలు స్వీకరించాం. ఇంకా నిర్ణయమేమి తీసుకోలేదు’ అని భూపిందర్ పేర్కొన్నారు. బ్రిజ్భూషణ్సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో గత నెల 23 నుంచి రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే.