Amol Muzumdar | ఇది ఎవరూ రాయని కథ. ఎవరికీ తెలియని కథ. ఇది భారత జట్టు జెర్సీని ఎప్పుడూ ధరించని.. దేశం తరఫున ఆడిన వారు సైతం సాధించలేని విజయాన్ని సాధించిన ఓ ఆటగాడి విజయ గాథ. అతనికి మైదానంలో అవకాశం రాదు. కానీ, ఇతరులకు ఆ అవకాశాన్ని అందించాడు. భారత జట్టును ప్రపంచకప్ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. హ్యాట్రిక్ పరాజయాలు ఎదురైనా మీరే విజేతలు అంటూ జట్టును ముందుండి నడించింది ఒకే ఒక వ్యక్తి. అతడే అమోల్ మజుందార్. ఈయనే భారత మహిళల జట్టు కోచ్. ఈ ఆయన మాజీ డొమెస్టిక్ క్రికెటర్. అమోల్ మజుందార్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో చాలా పోరాటమే చేశాడు. పరుగుల వరద పారించినా టీమిండియాలో చోటు దక్కలేదు. అమోల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..!
మజుందార్ జీవితం నిరీక్షణతో ప్రారంభమైంది. 1988లో 13 ఏళ్ల వయసులో.. స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ అయిన హారిస్ షీల్డ్ సందర్భంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం నిరీక్షించాడు. ఆ రోజే అమోల్ జట్టులో ఆడుతున్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి 664 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ రోజు ముగిసింది. ఇన్నింగ్స్ కూడా డిక్లేర్ చేశారు. కానీ, అమోల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సంఘటన అతని జీవితానికి చిహ్నంగా మారింది. బ్యాటింగ్ చేసే అవకాశం అమోల్‌కు ఎప్పుడూ అవకాశం దక్కలేదు. 1993లో బాంబే (ప్రస్తుత ముంబయి) తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన సమయంలో తన తొలి మ్యాచ్‌లోనే 260 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అది ప్రపంచంలో ఏ ఆటగాడికైనా అత్యధిక తొలి స్కోరు. అతను ఓ గొప్ప బ్యాట్స్‌మెన్ అవుతాడని అంతా భావించారు. కానీ, విధి వేరేలా ఉంది. రెండుదశాబ్దాలకుపైగా కెరీర్లో అమోల్ 11వేల పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ, భారతదేశం తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. టెండూల్కర్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ వంటి దిగ్గజాలతోనే కెరియర్ ప్రారంభించాడు. వారి నీడలో మజుందార్ కనుమరుగయ్యాడు.

2002 నాటికి దాదాపుగా టీమిండియాలో చోటు దక్కతుందనుకున్న ఆశను వదులుకున్నాడు. ఎంత రాణించినా సెలెక్టర్లు విస్మరిస్తూనే వచ్చారు. దాంతో ఒక దశలో తనకు ఎప్పుడు అవకాశం వస్తుందో అర్థం కాలేదు. ఆ సమయంలో అమోల్ తండ్రి అనిల్ మజుందార్ ‘ఆటను ఆపేయొద్దు. నీలో ఇంకా క్రికెట్ మిగిలి ఉంది’ అని చెప్పాడు. ఈ ఒక్క మాట అమోల్ జీవితాన్ని మార్చేసింది. మళ్లీ క్రికెట్ ఆడి 2006లో ముంబయి తరఫున రంజీ ట్రోఫీని గెలిచాడు. ఈ సమయంలో యువ ఆటగాడు రోహిత్ శర్మకు ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తొలి అవకాశం ఇచ్చాడు. అమోల్ మొత్తం 171 మ్యాచుల్లో 11,167 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు. రెండు దశాబ్దాలలో 30 సెంచరీలు చేసినప్పటికీ భారత జట్టు తరఫున ఆడే అవకాశం దక్కపోవడం గమనార్హం.

2014లో అమోల్ రిటైర్మెంట్ సమయంలో సచిన్ టెండూల్కర్ మజుందార్ ఆటకు నిజమైన సేవకుడు అని ప్రశంసించాడు. కానీ, అమోల్ హృదయం అంతా శూన్యంతో నిండిపోయింది. ‘నేను ఎప్పుడూ భారత జాతీయ జట్టు తరఫున ఆడలేదు. అదే నేను మిస్ అయిన ఏకైక విషయం’ అని తెలిపాడు. 2014లో క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లతో పనిచేశాడు. తక్కువ మాట్లాడుతూ.. ప్రతిదీ లోతుగా అర్థం చేసుకునే కోచ్‌గా మంచి ప్రశంసలు అందుకున్నాడు. 2023 అక్టోబర్‌లో భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియామకమయ్యాడు. భారత జట్టు తరఫున ఎప్పుడూ ఆడని వ్యక్తిని కోచ్ ఎలా చేస్తారని చాలా మందిని ప్రశ్నించారు. కానీ, రెండేళ్ల తర్వాత ప్రశ్నించిన వ్యక్తులు తలదించుకుంటున్నారు.
2025 వరల్డ్ కప్ సమయంలో గ్రూప్ దశలో భారత జట్టు ప్రదర్శన అందరినీ నిరాశ పరిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓటమిపాలైంది. ఆ తర్వాత సోషల్ మీడియా మీమ్స్‌తో నిండిపోయింది. భారీగా విమర్శలు వచ్చాయి. అప్పుడే మజుందార్ తీవ్రంగా స్పందించాడు. హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సర్ (మజుందార్) ‘మీరు ఈ మ్యాచ్‌ను సులభంగా ముగించి ఉండాలి’ అన్నారు. ‘అమోల్ సర్ ఏమి చెప్పినా హృదయపూర్వకంగా చెబుతారు. కాబట్టి మేమందరం దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ‘ఇది ఒక సెంటిమెంట్. కానీ లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడం’ అని మజుందార్ చెప్పిన మాటలు ఆ క్షణం మొత్తం జట్టు ఆలోచనను మార్చివేసింది. చక్‌దే ఇండియా మూవీలో కబీర్ ఖాన్ (షారుఖ్ ఖాన్)లా జట్టులో స్ఫూర్తిని నింపాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్‌కు ముందు అమోల్ డ్రెస్సింగ్ రూమ్ వైట్‌బోర్డ్‌పై ఒకే ఒక లైన్ రాశాడు. ‘ఫైనల్‌కు చేరుకోవడానికి మాకు వారి కంటే ఒక పరుగు మాత్రమే అవసరం, అంతే’ అని రాయగా.. ఒక సాధారణ వాక్యమే అయినా.. తన లోతైన ఆలోచనతో టీమిండియా అద్భుతం సాధించింది. మజుందార్ నిర్ణయించినట్లుగానే జెమిమా రోడ్రిగ్స్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసింది. ఆమె అజేయంగా 127 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 89 పరుగులతో రాణించింది. భారత్ 339 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి ఆస్ట్రేలియాను ఓడించింది. జట్టు సంబరాలు చేసుకున్నా.. అమోల్ మజుందార్ మౌనంగా నిలబడిపోయాడు. మ్యాచ్‌లో విజయం తర్వాత భావేద్వానికి లోనయ్యాడు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీమిండియా జెర్సీని ధరించని వ్యక్తి కోచ్‌గా మారి.. భారత జట్టును ప్రపంచకప్ ఫైనల్ వరకు నడిపించాడు. చక్ దే ఇండియాలో కబీర్ ఖాన్ ప్రాత తరహాలోనే అమోల్ ఎన్నో బాధను బరించాల్సి వచ్చింది. తాను నిబ్బరంగా ఉంటూ జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. మజుందార్ కథను స్క్రీన్ రైటర్ రాయలేదు. ఓసారి ఆల్ రౌండర్ స్నేహ్ రాణా మాట్లాడుతూ.. ‘ఆయన మాకు అత్యంత స్నేహపూర్వక కోచ్. ఎప్పుడూ అరవడు. అన్నీ వింటాడు. మాట్లాడినప్పుడు మీరు బాగా చేయాలనుకుంటున్నారు’ అని చెప్పేవాడు’ అని వ్యాఖ్యానించింది. మజుందార్ జట్టు టెక్నిక్ నేర్పించలేదు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఏ ప్లేయర్ అయినా ఏ వేదికపైనైనా నిలబడి గెలవగలరని భావించాలా చేశాడు.
అమోల్ మజుందార్ భారత జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. 13 సంవత్సరాల వయసులో బ్యాటింగ్ చేసే అవకాశం లభించని ఆ బాలుడు.. ఇప్పుడు కోచ్ అయ్యాడు. మొత్తం జట్టుకు ఛాంపియన్లుగా మారే అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు జట్టులో స్థానం కోసం చూసిన ఎదురుచూపే.. ప్రస్తుతం అమోల్‌కు గుర్తింపుగా మారింది. క్రికెట్ మైదానంలో ఆడే వారికి మాత్రమే కాదు.. హృదయపూర్వకంగా ఆడే వారికి కూడా ఒక ఆట అని నిరూపించాడు. కొన్నిసార్లు ఆట ఆడిన వారిని గుర్తుంచుకోదు. కానీ దాన్ని మార్చిన వారిని గుర్తుంచుకుంటుంది. అమోల్ మజుందార్ దాన్ని నిజం చేసి చూపించాడు.