న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్గా అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ముజుందార్ను సీనియర్ మహిళల టీమ్ కొత్త హెడ్కోచ్గా ఎంపిక చేసింది. ఈ పదవి కోసం పోటీపడిన వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం.. క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ఏకగ్రీవంగా ముజుందార్ వైపు మొగ్గింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధృవీకరించింది.
అమోల్ ముజుందార్ భారత దేశవాలీ క్రికెట్లో ఓ వెలుగు వెలిగారు. తన 21 ఏళ్ల కెరీర్లో 171 మ్యాచ్లు ఆడిన ముజుందార్ మొత్తం 11 వేల పై చిలుకు పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. ముందుగా ముంబై తరఫున, ఆ తర్వాత అస్సాం, ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ఆడిన ముజుందార్.. టీమ్ సభ్యుడిగా పలు రంజీ ట్రోఫీలు గెలిచాడు. టీమిండియా మహిళల హెడ్కోచ్గా ముజుందార్ ఎన్నికను తాము స్వాగతిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ముజుందార్ ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్లో మహిళా టీమ్ మరింత బలోపేతం అవుతుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. కాగా 21 ఏళ్లు దేశవాలీ క్రికెట్ ఆడిన ముజుందార్కు భారత జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు.