అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్.. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. నిరుడు రోలాన్డ్ గారోస్‌లో రన్నరప్‌గా నిలిచిన గాఫ్ అదే జోరు కనబరుస్తూ.. మరో టీనేజర్ ఆండ్రీవాను చిత్తుచేసింది. టాప్ సీడ్ స్వియాటెక్ సునాయాసంగా ప్రిక్వార్టర్స్ చేరగా.. ముచోవా, హద్దద్ మైయా ముందంజ వేశారు. గాయం కారణంగా నాలుగో సీడ్ రిబాకినా పోటీ నుంచి తప్పుకుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ దూకుడు కొనసాగుతున్నది.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కొకొ గాఫ్ విజయ పరంపర కొనసాగుతున్నది. నిరుడు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన 19 ఏండ్ల గాఫ్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో శనివారం 6-7 (5/7), 6-1, 6-1తో మిరా ఆండ్రీవా (రష్యా)ను చిత్తుచేసింది. ఈ విజయంతో గాఫ్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. క్రాస్ కోర్ట్ బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడిన గాఫ్.. పదహారేండ్ల ఆండ్రీవాను గుక్కతిప్పుకోనివ్వలేదు. రెండు గంటలకు పైగా సాగిన పోరులో గాఫ్ 35 విన్నర్లు కొట్టగా.. ఆండ్రీవా 17కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్ 26 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. రష్యా అమ్మాయి 38 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్లో హోరాహోరీగా పోరాడి ఓడిన గాఫ్.. ఆ తర్వాత విజృంభించింది. 76 శాతం నెట్పాయింట్లు ఖాతాలో వేసుకున్న అమెరికా చిన్నది.. చివరి రెండు సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది.
స్వియాటెక్ అలవోకగా..
టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఇగా స్వియాటెక్ అలవోక విజయం సాధించింది. మూడో రౌండ్లో స్వియాటెక్ 6-0, 6-0తో చైనా ప్లేయర్ వాంగ్‌ను చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నాలుగోసీడ్ రిబాకినా వాకొవర్ ఇవ్వడంతో ప్రత్యర్థి సొరిబెస్ టొర్మో ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో హద్దద్ మైయా 5-7, 6-4, 7-5తో అలెగ్జెండ్రోవాపై, పెరా 6-4, 7-6 (7/2)తో కొకిరెటోపై గెలుపొందారు.
అల్కరాజ్ అదే జోరు..
నిరుడు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి గ్రాండ్‌స్లామ్‌లో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్‌సీడ్ అల్కరాజ్ 6-1, 6-4, 6-2తో సీనియర్ ఆటగాడు షపలోవ్పై విజయం సాధించాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ 6-2, 6-2, 6-3తో స్వార్ట్మన్ను చిత్తు చేయగా.. నాలుగో సీడ్ రూడ్ 4-6, 6-4, 6-1, 6-4తో జాంగ్‌పై గెలుపొందాడు.