RCB vs UPW | ముంబై: అలీసా హీలీ (47 బంతుల్లో 96 నాటౌట్; 18 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన పోరులో యూపీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో బెంగళూరుకు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలీసా పెర్రీ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం సాధించగా.. సోఫియా డివైన్ (36) రాణించింది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫియా ఎకెల్‌స్టోన్ 4, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 139 పరుగులు చేసింది. అలీసా హీలీ శతకానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోగా.. దేవిక వైద్య (36 నాటౌట్; 5 ఫోర్లు) సత్తాచాటింది.