RCB vs MI | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో రెండో విజయం ఖాతాలో వేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. మొదటబౌలింగ్లో రాణించిన ముంబై.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా.. ఆనక హీలీ మాథ్యూస్, స్కీవర్ బ్రంట్ మెరుపులతో హర్మన్‌ప్రీత్ బృందం ఘనవిజయం సాధించింది.
ముంబై: టాపార్డర్ దంచి కొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. లీగ్ ఆరంభ పోరులో గుజరాత్‌పై భారీ విజయం నమోదు చేసుకున్న ముంబై.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 155 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన బెంగళూరుకు ఇది వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. స్మృతి మందన (23), రిచా ఘోష్ (28), కనిక అహూజ (22), శ్రెయాంక పాటిల్ (23), మేగన్ షుట్ (20) తలా కొన్ని పరుగులు చేశారు.
ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ 3, సైకా ఇషాఖ్, అమేలియా కెర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్), స్కీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్) విజృంభించారు. ఆల్‌రౌండ్ ప్రతిభ చాటిన హీలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఒకరి వెంట ఒకరు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు మంచి ఆరంభమే దక్కింది. కెప్టెన్ స్మృతి మందనతో పాటు సోఫియా డివైన్ (16) ధాటిగా ఆడటంతో ఆరంభంలో స్కోరు బోర్దు పరుగులు పెట్టింది. ఈ దశలో ముంబై బౌలర్లు సత్తాచాటి నాలుగు పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దిశ (0), పెర్రీ (13), హీతర్ నైట్ (0) విఫలమయ్యారు. ఇక బెంగళూరు పనైపోయినట్లే అనుకుంటున్న సమయంలో మిడిలార్డర్ పోరాడింది. రిచా, కనిక, శ్రెయాంక, షుట్ కాస్త పోరాడటంతో బెంగళూరు చివరకు 155 పరుగులకు ఆలౌటైంది.
దంచుడే.. దంచుడు..
ఓ మాదిరి లక్ష్యఛేదనలో ముంబై ఆరంభం నుంచే బాదుడు ప్రారంభించింది. విండీస్ స్టార్ హీలీ మాథ్యూస్‌తో పాటు మరో ఓపెనర్ యస్తిక భాటియా (23; 4 ఫోర్లు) ఎడాపెడా బౌండ్రీలు కొట్టడంతో చేజింగ్‌లో ముంబైకి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కీవర్ బ్రంట్.. బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడింది. అటు మాథ్యూస్, ఇటు బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. ఎనిమిదో ఓవర్లో బ్రంట్ మూడు ఫోర్లు బాదితే.. తదుపరి ఓవర్లో మాథ్యూస్ రెండు బౌండ్రీలు అరుసుకుంది. పదకొండో ఓవర్లో వీరిద్దరి ధాటికి 15 పరుగులు రాగా.. తదుపరి ఓవర్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. 13వ ఓవర్లో స్కీవర్ 4,6.. మాథ్యూస్ 4,4 దంచడంతో ముంబై విజయం ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 18,4 ఓవర్లలో 155 ఆలౌట్ (రిచా 28, స్మృతి మందన 23; హీలీ మాథ్యూస్ 3/28, సైకా 2/26),
ముంబై: 14.2 ఓవర్లలో 159/1 (హీలీ మాథ్యూస్ 77 నాటౌట్, స్కీవర్ బ్రంట్ 55 నాటౌట్; ప్రీతి 1/34).