ప్రయాగ్‌రాజ్: క్రికెటర్ యశ్ దయాల్(Yash Dayal)కు ఊరట లభించింది. అతన్ని అరెస్టు చేయవద్దు అని అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆ ఐపీఎల్ క్రికెటర్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున యశ్ దయాల్ ఆడుతున్నాడు. తదుపరి విచారణ వరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ విషయాన్ని అతని తరపు న్యాయవాది గౌరవ్ త్రిపాఠి పేర్కొన్నారు.
జస్టిస్ సిద్ధార్థ వర్మ, అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను పాస్ చేసింది. ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ క్రికెటర్ దయాల్ పిటీషన్ దాఖలు చేశాడు. 27 ఏళ్ల క్రికెటర్‌పై జూలై ఆరో తేదీన పిటీషన్ నమోదు అయ్యింది. ఘజియాబాద్ జిల్లాలోని ఇందిరాపురం పోలీసు స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 (మోసపూరితంగా, లైంగికంగా వేధించడం) కింద కేసు బుక్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళను శృంగారపరంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఇద్దరూ అయిదేళ్ల క్రితం కలుసుకున్నారు. కానీ దయాల్ ప్రతిసారి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ క్రికెటర్ మరో అమ్మాయితో తిరుగుతున్నట్లు సదరు మహిళ ఫిర్యాదులో వెల్లడించింది. ముఖ్యమంత్రి ఆన్లైన్ గ్రీవియన్స్ పోర్టల్‌కు జూన్ 21వ తేదీన ఆమె ఫిర్యాదు అందింది.