AICF | ఢిల్లీ: నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ.3.2 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 97 ఏండ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో చారిత్రక విజయం సాధించిన భారత చదరంగ వీరులకు సన్మానం సందర్భంగా ఏఐసీఎఫ్ అధ్యక్షుడు నితిన్ నారంగ్ నగదు బహుమతి ప్రకటన చేశారు.
ఆటగాళ్లకు రూ. 25 లక్షలు, పురుషుల, మహిళల జట్టు కోచ్‌లు అయిన అభిజిత్ కుంటె, శ్రీనాథ్ నారాయణన్‌కు తలా రూ.15 లక్షలు పంచనుండగా భారత బృందానికి చీఫ్‌గా వ్యవహరించిన దివ్యేందు బరువకు రూ.10 లక్షలు, అసిస్టెంట్ కోచ్‌లలో ఒక్కొక్కరికి రూ. 7.5 లక్షలు అందనున్నాయి. ఈ సందర్భంగా నితిన్ నారంగ్ మాట్లాడుతూ.. ‘చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణాలు నెగ్గాలన్న మన కోరిక నెరవేరింది. కానీ ఈ విజయయాత్ర మాత్రం కొనసాగుతుంది’ అని అన్నారు.