కోల్‌కతా : దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రంజీ నాకౌట్ సమరానికి తెరలేవనుంది. లీగ్ దశలో అదరగొట్టిన జట్లు కీలకమైన క్వార్టర్స్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముంబై-హర్యానా, విదర్భ-తమిళనాడు, జమ్ముకశ్మీర్-కేరళ, సౌరాష్ట్ర-గుజరాత్ వేర్వేరు వేదికల్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, హర్యానాను చారిత్రక ఈడెన్‌గార్డెన్స్‌లో ఢీకొనబోతున్నది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పసికూన మేఘాలయపై ఇన్నింగ్స్ విజయంతో ముంబై మంచి జోరుమీదుంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం లాహ్లి(హర్యానా)లో జరుగాల్సి ఉన్నా..ఎలాంటి సమాచారం లేకుండా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు మార్చారు. దీంతో సొంతగడ్డపై సత్తాచాటుదామనుకున్న హర్యానా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
మరోవైపు రికార్డు స్థాయిలో 43వ టైటిల్‌పై కన్నేసిన ముంబై..ప్రత్యర్థి ఎవరైనా కడదాకా పోరాడటంలో ఆరితేరింది. దీనికి తోడు సూర్యకుమార్‌యాదవ్, శివమ్ దూబే చేరికతో ముంబై మరింత పటిష్ఠంగా తయారైంది. వీరికి తోడు ఇప్పటికే మూడు సెంచరీలు కొట్టిన సిద్దేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్, శామ్స్ ములానీతో పాటు కెప్టెన్ రహానే మంచి ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్, దూబే రాకతో తుది జట్టు కూర్పుపై సందిగ్ధత ఏర్పడింది. ఒకవేళ వీరిద్దరిని తీసుకుంటే మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చు. మరోవైపు హర్యానా.. ముంబైకి దీటైన పోటీనిచ్చేందుక పావులు కదుపుతున్నది. కెప్టెన్ అంకిత్‌కుమార్, నిశాంత్సింధు, హిమాన్షు రాణాతో కూడిన బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. అన్షుల్ కాంబోజ్, అనూజ్ థాక్రల్, జయంత్ యాదవ్ చెలరేగితో ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు.
దూబే అదుర్స్ : మిగతా క్వార్టర్స్ మ్యాచ్‌ల విషయానికొస్తే విదర్భ యువ స్పిన్నర్ హర్ష్ దూబే లీగ్‌లో 55 వికెట్లతో ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్నాడు. గత నాలుగేండ్లుగా చెన్నైలో లీగ్ క్రికెట్ ఆడుతున్న దూబే తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో దూబే అదరగొట్టాడు. కేవలం బౌలింగ్ వరకు పరిమితం గాకుండా బ్యాటింగ్‌లోనూ మూడు అర్ధసెంచరీలతో 308 పరుగులతో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా, రంగనా హెరాత్‌ను ఆదర్శంగా తీసుకునే దూబే స్పిన్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకునేందుకు ముందుకుసాగుతున్నాడు. మిగతా క్వార్టర్స్‌లో జమ్ము కశ్మీర్ ప్లేయర్లు శుభమ్ ఖజురియా(663 పరుగులు), అఖిబ్ నబి(38 వికెట్లు) మంచి ఫామ్‌మీదున్నారు. ఇలా రంజీ క్వార్టర్స్ రసవత్తరంగా సాగే అవకాశముంది.