US Open | న్యూయార్క్: సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్‌లో ఐదో రోజు సంచలన ఫలితాలు వెలువడ్డాయి. టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా ఉన్న టాప్ సీడ్ కార్లొస్ అల్కారజ్‌కు రెండో రౌండ్లోనే షాక్ తగిలింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ స్పెయిన్ కుర్రాడు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 1-6, 5-7, 4-6తో బొటిక్ వాన్ డి (నెదర్లాండ్స్) చేతిలో పరాభవం పాలయ్యాడు. తొలి సెట్ నుంచే లయ కోల్పోయిన అల్కారజ్.. బొటిక్ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్ల ముందు తేలిపోయాడు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ నెగ్గడంతో పాటు ఒలింపిక్స్‌లోనూ రజతం సాధించిన అల్కారజ్.. యూఎస్ ఓపెన్‌పై కన్నేసినా అతడికి నిరాశ తప్పలేదు. ఇతర మ్యాచ్‌లలో డేనియల్ మెద్వెదెవ్ (రష్యా) 6-3, 6-2, 7-6 (5/7)తో ఫాబియన్ మరొజన్ (హంగేరి)ని ఓడించగా జన్నిక్ సిన్నర్ (ఇటలీ), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), డాన్ ఎవాన్స్ (బ్రిటన్) తమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్‌కు చేరారు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాజీ చాంపియన్ నవొమి ఒసాకా (జపాన్) 3-6, 6-7 (5/7)తో కరొలినా ముచొవ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాభవం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలీనా రిబాకినా (కజకిస్థాన్) గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. కరొలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ఇగా స్వియాటెక్ (పోలండ్), జాస్మిన్ పాలోని (ఇటలీ) మూడో రౌండ్‌కు చేరారు.