పారిస్: ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన స్పెయిన్ నయా బుల్ కార్లొస్ అల్కరాజ్.. ఈ టోర్నీలో వరుసగా రెండో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం ఫిలిప్పీ చార్టర్ వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీస్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 4-6, 7-6 (7/3), 6-0, 2-0తో ఇటలీ యువ సంచలనం లొరెంజో ముసెట్టిని చిత్తు చేసి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఇరువురి మధ్య సుమారు రెండున్నర గంటల పాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి సెట్ కోల్పోయినప్పటికీ అల్కరాజ్ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస సెట్లలో నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఏకంగా 67 నిమిషాలు సాగగా.. టై బ్రేక్‌లో అల్కరాజ్ జోరు కొనసాగించి సెట్‌ను గెలుచుకున్నాడు.
మ్యాచ్‌పై పట్టు చిక్కాక ఈ స్పెయిన్ కుర్రాడు వెనుదిరగలేదు. మూడో సెట్ ఏకపక్షంగా సాగింది. విజయానికి ఒక్క సెట్ దూరంలో నిలిచిన అతడు.. నాలుగో సెట్లో 2-0 ఆధిక్యంతో ఉండగా ముసెట్టి కాలికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోంచే తప్పుకోవడంతో అల్కరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రాండ్‌స్లామ్ ఈవెంట్స్‌లో అల్కరాజ్కు ఇది ఐదో ఫైనల్. సెమీస్‌లో అల్కరాజ్ 35 విన్నర్లు కొట్టగా ముసెట్టి 22 సాధించాడు. అంచనాలే లేకుండా బరిలోకి దిగిన ముసెట్టి.. ప్రిక్వార్టర్స్‌లో రూనెతో పాటు క్వార్టర్స్‌లో టియాఫొ (అమెరికా) వంటి స్టార్ ప్లేయర్లకు షాకిచ్చి సెమీస్‌లో అల్కరాజ్కు తీవ్ర పోటీనిచ్చినా గాయం కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. పురుషుల సింగిల్స్‌లో భాగంగా సిన్నర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా) మధ్య జరిగే రెండో సెమీస్‌లో గెలిచే విజేతతో అల్కరాజ్ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ కొత్త చాంపియన్‌ను చూడబోతున్నది. మూడేండ్ల క్రితం ఈ టోర్నీ ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయిన అమెరికా అమ్మాయి, రెండో సీడ్ కోకో గాఫ్.. మరోసారి పట్టువదలకుండా ఫైనల్ చేరింది. గురువారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీస్‌లో గాఫ్ 6-1, 6-2తో ఫ్రాన్స్ సంచలనం బోయిసన్ను మట్టికరిపించి టాప్ సీడ్ అరీనా సబలెంకతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈ టోర్నీలో సంచలన విజయాలు సాధించిన బోయిసన్.. కీలక మ్యాచ్‌లో మాత్రం గాఫ్ జోరు ముందు తేలిపోయింది. ఇక ముఖాముఖి పోరులో గాఫ్, సబలెంక 5-5తో సమంగా ఉన్నారు. ఫైనల్లో మట్టికోర్టు మహారాణిగా నిలిచేదెవరనేది శనివారం తేలనుంది.