పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా.. టేబుల్ టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆకుల శ్రీజ.. బరిలోకి దిగిన తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పసిడి పతకంతో అదుర్స్ అనిపించింది. సింగిల్స్‌లో పతకానికి చేరువ దాక వచ్చి పోరాడి ఓడటం.. డబుల్స్‌లో ప్రపంచ మేటి ఆటగాడు శరత్ కమల్‌తో జతకట్టడం..
అంతర్జాతీయ స్థాయిలో తొలి గోల్డ్ మెడల్ నెగ్గడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం.. ఇలా బర్మింగ్‌హామ్ అనుభవాలను నమస్తే తెలంగాణతో పంచుకుంది. అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన శ్రీజ.. పక్షం రోజులు తిరిగేసరికి చాంపియన్‌గా నిలువడం మహదానందంగా ఉందంటున్నది. స్వదేశంలో అడుగుపెట్టగానే రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా స్వాగతం పలకడం తన జీవితంలో మర్చిపోలేనంటున్న శ్రీజతో ప్రత్యేక ఇంటర్వ్యూ..
జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. పోటీ అధికంగా ఉండే కామన్వెల్త్ క్రీడల్లో చాంపియన్‌గా నిలుస్తానని ముందు ఊహించలేదు. వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించా. టీమ్ విభాగంలో పతకం సాధించలేకపోవడం కాస్త నిరాశ పరిచినా.. డబుల్స్‌లో స్వర్ణం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సభ్యుల ఆనందానికైతే అవధులు లేవు!
మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఓటమి నన్ను కుంగదీసింది. కాంస్య పతక పోరులో శక్తి వంచన లేకుండా పోరాడా. అయినా ఒత్తిడి కారణంగా నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
కలిసి ప్రాక్టీస్ చేయడానికి ముందు.. నా వల్ల పాయింట్ పోతే శరత్ అన్న ఏం అంటారో అని భయపడ్డా. కానీ మ్యాచ్‌లో ఆయన సహకారం మరువలేనిది. తప్పు నేను చేసినా.. ఆయనే సారీ చెబుతూ ముందుకు నడిపించారు. పాయింట్ పోయినప్పుడు నేను ఒత్తిడికి లోను కాకూడదనే ఉద్దేశంతో ప్రోత్సహించారు. తదుపరి గేమ్‌పై దృష్టి పెట్టేందుకు అది నాకు ఎంతగానో ఉపకరించింది. మ్యాచ్ పాయింట్ చేజిక్కించుకున్నాక.. ఆనందంలో అన్నయ్య నన్ను ఎత్తుకోవడం ఎప్పటికీ మరువలేను.
ఆసియా క్రీడలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అంతకుముందు ఇంటర్నేషనల్ ర్యాంక్ మెరుగు పర్చుకోవాలనుకుంటున్నా. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని సత్తాచాటుతా. టాప్-50లో చోటు దక్కించుకుంటే.. ఆసియా క్రీడలతో పాటు పారిస్ ఒలింపిక్స్‌కు ఉపయోగ పడుతుంది.
కామన్వెల్త్‌తో పోల్చుకుంటే.. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ చాలా క్లిష్టమైనవి. పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లు పాల్గొనే విశ్వక్రీడల్లో రాణించాలంటే ఇప్పటి నుంచే సిద్ధం కాక తప్పదు. రాత్రికి రాత్రే చాంపియన్లు పుట్టుకు రారు. దాని వెనుక కఠోర శ్రమ దాగి ఉంటుంది. ప్రస్తుతం నేను శ్రమించాలనుకుంటున్నా. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా అంతిమ లక్ష్యం.
సింగిల్స్ పరాజయం అనంతరం గదిలో కూర్చొని బాధ పడుతున్న సమయంలో కోచ్, శరత్ అన్న అండగా నిలిచారు. ‘సింగిల్స్‌లో పతకం చేజారినా.. డబుల్స్ మిగిలే ఉంది కదా.. అందులో మనం స్వర్ణం నెగ్గుతున్నాం’ అని శరత్ అన్న నాలో ఉత్సాహం నింపారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న తొలిసారే పతకం పట్టడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషి చాలా ఉంది. అడిగిన వెంటనే వ్యక్తిగత కోచ్ సోమ్‌నాథ్‌ను సాట్స్లోకి తీసుకోవడం నాకు ఎంతగానో సహకరిచింది. తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్, సాట్స్ అధికారుల సహకారం మరువలేనిది.
ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెన్నంటి నిలిచి ప్రోత్సహించారు. పతకం నెగ్గి హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే.. క్రీడా శాఖ మంత్రి స్వాగతం పలకడం మరువలేని అనుభూతి. ప్రభుత్వం నుంచి మరింత సహకారం లభిస్తే.. రానున్న టోర్నీల్లో తప్పక పతకాలు సాధిస్తా.