‘కృషి ఉంటే మనిషి రుషులవుతారు.. మహా పురుషులవుతారు’ ఇది ముమ్మాటికి నిజం! ప్రతిభకు కులం, మతం, ప్రాంతం గీటురాయి కాదని మరోమారు నిరూపితమైంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే బీహార్ నుంచి ఓ క్రికెట్ సంచలనం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే ఆ రాష్ట్రంలో మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ తురుపుముక్క.. బ్రిటిష్ గడ్డపై తళుక్కున మెరిసింది. గెలుపే ఎరుగని బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఆ బీహార్ బుల్లెట్ గడగడలాడించింది. ఎన్నాళ్లుగానో దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును తన అద్భుత బౌలింగ్‌తో సాకారం చేసిన ఆ బౌలరే ఆకాశ్‌దీప్.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ఆకాశ్‌దీప్ ప్రస్తుత భారత క్రికెట్లో ఓ సంచలనం! దిగ్గజ బౌలర్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ జతగా బర్మింగ్‌హామ్‌లో వికెట్ల వేట కొనసాగించాడు. నిర్జీవమైన పిచ్‌పై బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లకు పట్టపగలు చుక్కలు చూపించాడు. వైవిధ్యమైన పేస్‌తో ప్రపంచ మేటి బ్యాటర్‌గా వెలుగొందుతున్న రూట్‌తో పాటు పలువురు ఇంగ్లండ్ బ్యాటర్ల వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నాడు.
ఆకాశ్ కెరీర్‌ను ఓసారి పరిశీలిస్తే.. బర్మింగ్‌హామ్‌కు ముందు బర్మింగ్‌హామ్ తర్వాత అన్నట్లు ఉంటుంది. 58 ఏండ్ల తర్వాత బర్మింగ్‌హామ్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టడంలో ఈ బీహారీ బాబుదే కీలక భూమిక. ఇంగ్లండ్ గడ్డపై చేతన్‌శర్మ తర్వాత టెస్టుల్లో 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచిన ఆకాశ్ క్రికెట్ ప్రస్థానం ఒడిదొడుకుల పయనం. అసలు క్రికెట్ అంటేనే పెద్దగా పరిచయం లేని బీహార్‌లోని దెహ్రీలో డిసెంబర్ 15, 1996లో ఆకాశ్ జన్మించాడు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన ఆకాశ్‌కు క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం. 2011వన్డే ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీ విన్నింగ్ సిక్స్ చూసి క్రికెట్‌పై మరింత మక్కువ పెంచుకున్న ఈ యువ క్రికెటర్‌కు తగిన ప్రోత్సాహం దొరకలేదు.
ఏదైనా పనిచేస్తే గానీ రోజు గడవని స్థితిలో తండ్రి నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ అతడు ఆటపై మక్కువతో బీహార్ నుంచి పనికోసం బెంగాల్‌కు రావడం అతని క్రికెట్ కెరీర్‌కు నాందిపడింది. 2010లో దుర్గాపూర్‌కు వచ్చిన ఆకాశ్.. తన అంకుల్ సహాయంతో స్థానిక క్రికెట్ క్లబ్లో చేరాడు. అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో రెండు నెలల వ్యవధిలో తండ్రితో పాటు సోదరున్నీ కోల్పోవాల్సి వచ్చింది. సరైన వైద్య సౌకర్యాలు లేని కారణంగా ఆప్తులను కోల్పోయిన ఆకాశ్ మూడేండ్ల పాటు క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
ఆ తర్వాత కోల్‌కతాలో యునైటెడ్ క్లబ్ ద్వారా సీఏబీ సెకండ్ డివిజన్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అక్కడి నుంచి బెంగాల్ అండర్-23 జట్టులోకి వచ్చాడు. అనతికాలంలోనే బెంగాల్ మూడు ఫార్మాట్లలో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 2019లో రంజీ రన్నరప్‌గా నిలిచిన బెంగాల్ జట్టులో ఆకాశ్ 35 వికెట్లతో సత్తాచాటాడు. ఇలా ఫార్మాట్ ఏదైనా బెంగాల్ తరఫున అదరగొడుతూ 2021 ఐపీఎల్ వేలంలో ఆర్సీబీతో చేరాడు. దేశవాళీలో ఆకాశ్ అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు జాతీయ జట్టులో అవకాశం కల్పించారు. 2024 ఫిబ్రవరిలో రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అత డు టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 8మ్యాచ్‌లాడిన ఈ 28 ఏండ్ల క్రికెటర్ 28.60 సగటుతో 25 వికెట్లు పడగొట్టాడు.
బర్మింగ్‌హామ్ టెస్టులో తన 10 వికెట్ల ప్రదర్శనను ఆకాశ్‌దీప్.. తన అక్కకు అంకితం చేశాడు. క్యాన్సర్ కోసం ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న తన అక్క కండ్లలో ఆనందం కోసమేనని ఉబికి వస్తున్న కన్నీటితో అతడు చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పుజారతో ఇంటర్వ్యూలో ఆకాశ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. గత కొన్ని నెలల నుంచి తన అక్క క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటుందని, ఆమె త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు. ఓవైపు మనసులో మెలితిప్పే బాధను అనుభవిస్తూ అతను భారత్‌కు అందించిన అపూర్వ విజయాన్ని అందరూ కొనియాడుతున్నారు.
ఆకాశ్‌దీప్‌ను అప్పుడే అందరూ జూనియర్ షమీ అంటూ పొగుడుతున్నారు. కచ్చితమైన వేగానికి స్వింగ్ జోడిస్తూ వికెట్ల వేట కొనసాగించే షమీని తలపిస్తున్నాడని అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. బుల్లెట్ లాంటి బంతులతో వికెట్లను విరగ్గొట్టే షమీ లాగే ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఆకాశ్.. ఇంగ్లీష్ బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేసిన తీరు ఫ్యాన్స్‌కు కనులవిందుగా మారింది. ఇంగ్లండ్ పేసర్లంతా కలిసి 593 పరుగులిచ్చి 9 వికెట్లు తీస్తే.. ఒక్క ఆకాశే 187 పరుగులతో 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఇందులో 7 వికెట్లు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం.