Akash Deep : ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తన కలను నిజం చేసుకున్నాడు. ఎప్పటినుంచో తన డ్రీమ్ కారు కొనాలనుకుంటున్న అతడు ఎట్టకేలకు రాఖీ పండుగ రోజున ఖరీదు చేశాడు. అమ్మ, అక్క, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి షోరూం వెళ్లి తనకెంతో ఇష్టమైన టయోటా ఫార్చునర్ (Tayota Fortuner) కారు కొన్నాడీ పేసర్. తన డ్రీమ్ కారు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడీ స్పీడ్‌స్టర్. ఆ పోస్ట్‌కు నా కల నిజమైంది అంటూ క్యాప్షన్ పెట్టాడు.
‘నా కల సాకారమైంది. కీ అందుకున్నాను. నాకు ఎంతో విలువైన వ్యక్తుల సమక్షంలో కారు కొనడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు ఆకాశ్. ఇంగ్లండ్‌లో సిరీస్ సమం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఆకాశ్.. స్వదేశం వచ్చాక తన కలల కారును సొంతం చేసుకున్నాడు. నలుపు రంగు టయోటా ఫార్చునర్‌ను ఇంటికి తీసుకెళ్లాడీ పేసర్. దీని ఖరీదు రూ.62 లక్షలు ఉంటుందని అంచనా. ఆకాశ్ కొత్త కారు పోస్ట్ క్షణాల్లో వైరలైంది. దీనిపై భారత టీ20 సారథి సూర్యకుమార్ స్పందిస్తూ.. ‘చాలా చాలా సంతోషం’ అంటూ కామెంట్ పెట్టాడు.
బర్మింగ్ హమ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు ఆకాశ్. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్లు బ్రూక్, రూట్లను బౌల్డ్ చేసి.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. తనకు బహుమతిగా లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని క్యాన్సర్‌తో పోరాడుతున్న తన సోదరికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే.
సిరీస్ సమం చేయడంలో కీలకమైన ఓవల్ టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి సూపర్ హాఫ్ సెంచరీ బాదాడు ఆకాశ్. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 107 రన్స్ జోడించాడు. అమూల్యమైన పరుగులతో జట్టు భారీ స్కోర్‌కు కారణమైన అతడు.. బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. మొత్తంగా మూడు టెస్టులు ఆడిన ఈ స్పీడ్ గన్ 13 వికెట్లతో రాణించాడు.