Ajinkya Rahane : పదహారో సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో ధోనీ సేన టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే.. ఆ జట్టు జైత్రయాత్ర వెనక అజింక్యా రహానే విధ్వంసక బ్యాటింగ్ ఉంది. ఫామ్‌లేమితో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ మాజీ కెప్టెన్ ఐపీఎల్(IPL 2023)లో ఇరదీస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై 29 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. తన ప్రదర్శన పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు.
‘నా ఉత్తమ ఆట ఇంకా బాకీ ఉంది. ఇదే ఫామ్‌ను సీజన్ ఆసాంతం కొనసాగించాలి అనుకుంటున్నా. ఏడాది, రెండేళ్ల క్రితం నాకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఛాన్స్‌లు రాకుంటే నాలో సత్తా ఉందని, నేను బాగా ఆడగలను అని ఎలా చాటగలను’ అని రహానే తెలిపాడు. అంతేకాదు ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీలో ఆడడం సౌకర్యంగా ఉందని అతను చెప్పుకొచ్చాడు. ధోనీ సారథ్యంలో నేను టీమిండియాకు ఆడాను. ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నా. అతని నాయకత్వం చాలా గొప్పగా ఉంటుంది అని రహానే వెల్లడించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చితక్కొట్టిన రహానే(71), శివం దూబే(50)
ఒకప్పటి రహానేకు ఇప్పటి రహానేకు ఎంతో తేడా కనిపిస్తోంది. ఇంతకుముందు అయితే.. మిడిలార్డర్లో వచ్చి నిదానంగా ఆడిన అతను.. ఇప్పుడు గేర్ మార్చాడు. మొదటి బంతి నుంచే వీరబాదుడు బాదుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ఈ సీజన్ రెండో మ్యాచ్‌లో రహానే తన బ్యాట్ పవర్ చూపించాడు. ముంబై ఇండియన్స్‌పై చెలరేగి ఆడి అర్థ శతకం బాదాడు. అదే ఫామ్‌ను కంటిన్యూ చేసిన అతను వరుస అర్థ శతకాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. శివం దూబేతో కలిసి విలువైన రన్స్ జోడించాడు దాంతో చెన్నై 234 పరుగులు కొట్టింది. ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో కోల్‌కతాను 49 పరుగుల తేడాతో ఓడించింది. ఐదు విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.