లీసెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane).. ఇంగ్లీష్ కౌంటీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడనున్నాడు. ఆ జట్టుతో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుత సీజన్ రెండో అర్థభాగంలో అతను జట్టుతో కలవనున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో చివరి అయిదు మ్యాచ్‌ల్లో రహానే ఆడనున్నట్లు క్లబ్ ప్రకటించింది. కౌంటీ వన్డే కప్‌లోనూ రహానే ఆడనున్నాడు. వియాన్ ముల్డర్ స్థానంలో 36 ఏళ్ల రహానే జతకలవనున్నాడు. రహానే అన్ని ఫార్మాట్లలో కలిసి ఇప్పటి వరకు 26 వేల పరుగులు చేశాడు. రహానే తన కెరీర్లో 51 సెంచరీలు బాదాడు. 265 అతని టాప్ స్కోర్. ఇండియా తరపున టెస్టుల్లో 8 వేల పరుగలు చేశాడు. దాంట్లో 15 సెంచరీలు ఉన్నాయి. కివీస్‌పై అత్యధికంగా 188 చేశాడు.
లీసెస్టర్ క్లబ్‌తో జలకలవడం సంతోషంగా ఉందని, క్లాడ్ హెండర్సన్, ఆల్ఫోన్సో థామస్‌తో మంచి సంబంధాలు కుదిరాయని, ఈ సమ్మర్లో క్లబ్ తరపున ఆడేందుకు ఆసక్తిగా ఉందని రహానే తన స్టేట్మెంట్లో తెలిపారు. జూలైలో లీసెస్టర్ జట్టుతో రహానే కలవనున్నాడు. జూలై 24వ తేదీన వన్డే కప్‌లో ఆడుతాడు.