AIFF President : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలిండియా ఫుట్బాల్ సమాఖ్య(AIFF)అధ్యక్షుడు కల్యాణ్ చౌబే(Kalyan Chaubey)కు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఓ ఆగంతుకుడు తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని ఆయన ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా హానీ చేస్తానని సదరు వ్యక్తి ఫోన్లో హెచ్చరించాడని కల్యాణ్ తెలిపాడు.
దాంతో, కేసు నమోదు చేసుకున్న ద్వారకా సెక్టార్ 23 పరిధిలోని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ కాల్ చేసింది ఎవరు? అనేది తేల్చేందుకు టెలికామ్ శాఖ సహాయం తీసుకుంటున్నారు. ఎఐఎఫ్ఎఫ్ చీఫ్ తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో.. ‘మా ఆఫీస్కు సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్య బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ను క్రితికా రత్తన్ అనే ఆఫీసర్ ఎత్తాడ’ని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు తమకు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న కల్యాణ్ చౌబేపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మాజీ సెక్రటరీ షాజీ ప్రభాకరన్తో పాటు మాజీ హెడ్కోచ్ ఇగొర్ స్టిమాక్ సైతం కల్యాణ్ తీరును విమర్శించారు. అతడు భారీగా అవినీతికి పాల్పడ్డాడని బాహాటంగానే ఈ ఇద్దరూ చెప్పారు. తాజాగా భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా(Baichung Bhutiya) సైతం ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన అవసరమని డిమాండ్ చేశాడు. ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని భూటియా సూచించాడు.