Ranji Trophy 2024: బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాతగా ఉన్న విధు వినోద్ చోప్రా కొడుకు అగ్ని చోప్రా క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మిజోరం తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సిక్కీంతో తొలి మ్యాచ్‌లో 258 (166, 92) పరుగులు చేసిన అతడు.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శతకంతో మెరిశాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చోప్రా.. 150 బంతుల్లో 21 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో 164 పరుగులు చేశాడు.
1998లో అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించిన అగ్ని చోప్రా.. అక్కడే క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. అండర్ – 19 స్థాయిలో ముంబై తరఫున ఆడిన అతడు.. ఇటీవలే రంజీలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ముంబై క్రికెట్లో ఉన్న పోటీ కారణంగా అగ్ని ప్రస్తుతం రంజీ సీజన్లో మిజోరం టీమ్‌కు ఆడుతున్నాడు. గతేడాది జరిగిన సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మిజోరం టీమ్‌కు అరంగేట్రం చేసిన అతడు.. రంజీలలో మాత్రం ఇరగదీస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడే అవకాశాలు లేకపోలేదు.
మున్నాబాయ్ సిరీస్‌తో పాటు పీకే, త్రీ ఇడియట్స్, సంజూ వంటి బ్లాక్ బస్టర్ సినిమానుల నిర్మించిన విధు వినోద్ చోప్రా గతేడాది 12th ఫెయిల్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. థియేటర్లలో సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా అదరగొడుతోంది.