హైదరాబాద్, ఆట ప్రతినిధి: చారిత్రక ఎల్బీ స్టేడియం మరోసారి వార్తల్లోకెక్కింది! క్రీడలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో మరోమారు తేటతెల్లమైంది. వార్షిక బడ్జెట్లో గతంలో ఎన్నడూలేని విధంగా నిధులు కేటాయించామంటూ బడాయికి పోయిన రాష్ట్ర ప్రభుత్వం..స్టేడియాలను నాన్స్పోర్ట్స్ ఈవెంట్లకు అద్దె ఇస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమంటూ నానా హంగామా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఉన్న స్డేడియాలను నాశనం చేస్తున్నది. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం మారిన తర్వాత కమర్షియల్ ఈవెంట్లకు అడ్డాగా మారిపోయింది.
మ్యూజికల్ నైట్, ఫోక్నైట్, సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లకు స్టేడియం చిరునామాగా మారింది. ఆదివారం ఇదే స్టేడియంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా కన్సర్ట్ జరిగింది. ఎడతెరిపిలేని వర్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. తమ అభిమాన నటుని కొత్త సినిమా కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కన్సర్ట్ జరుగుతున్నంత సేపు అలాగే ఉండిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. కన్సర్ట్ ముగిసిన తర్వాత ఎల్బీ స్టేడియం పరిస్థితి చూస్తే ‘క్యా హాలత్ హో గయా’ అంటూ పలువురు క్రీడాభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
క్రీడాటోర్నీలకు ఆతిథ్యమివ్వాల్సిన చారిత్రక స్టేడియం బురద పొలంగా మారిన తీరును చూసి మనోవేదనకు గురవుతున్నారు. ఎంతో మంది దిగ్గజాలను అందించిన ఘనమైన చరిత్ర కల్గిన స్టేడియం ఇలా అయిపోయిందా అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. కొత్త స్టేడియాలు కట్టడం మాట అటుంచుతే..కనీసం ఉన్న వాటిని కాపాడుకునే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. నాన్స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇవ్వచ్చని, అది జీవోలోనూ స్పష్టంగా ఉందంటూ పేర్కొంటున్న సాట్స్ ఎండీ ప్రస్తుత స్టేడియం దీనస్థితికి కారణమేంటో చెప్పాలని క్రీడాభిమానులు నిలదీస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన కన్సర్ట్కు సదరు సినీ నిర్మాణ సంస్థ రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. ఇలా అద్దెకు ఇవ్వడం ద్వారా వస్తున్న ఆదాయాన్ని సాట్స్..తాత్కాలిక ఉద్యోగుల జీతాలకు, స్టేడియం నిర్వహణకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. మరి కమర్షియల్ ఈవెంట్లకు ఇస్తూ ఇంకా ఎన్ని రోజులు స్టేడియాన్ని నాశనం చేస్తారంటూ క్రీడాభిమానులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్టేడియం పరిస్థితిపై ఆలోచించాలని మనవి చేస్తున్నారు.