WFI Elections Row 2023: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు కుస్తీ రంగంలో కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే ముగిసిన ఈ ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. ఎన్నికల ఫలితాల తొలి రోజే సాక్షి మాలిక్ ఆట నుంచి తప్పుకోగా నిన్న మరో కుస్తీ యోధుడు బజరంగ్ పునియా.. ‘పద్మశ్రీ’ని ప్రభుత్వానికి తిరిగిచ్చేశాడు. తాజాగా బజరంగ్ బాటలోనే మరో కుస్తీ యోధుడు వీరేందర్ సింగ్ కూడా ప్రభుత్వం తనకు అందజేసిన పద్మశ్రీని తిరిగిచ్చేందుకు సిద్ధమయ్యాడు. డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) లో భారత్‌కు మూడు గోల్డ్ మెడల్స్ అందించిన వీరేందర్ శనివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ట్విటర్ వేదికగా వీరేందర్ సింగ్ స్పందిస్తూ… ‘నేను కూడా నా సోదరి, ఈ దేశ ఆడబిడ్డ కోసం నా పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చేస్తా. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారూ.. నేను మీ కూతురు, నా చెల్లెలు అయిన సాక్షి మాలిక్‌ను చూసి గర్విస్తున్నాను. కానీ ఈ దేశంలో దిగ్గజ ఆటగాళ్లు కూడా దీనిపై స్పందించాలి..’ అని సచిన్ టెండూల్కర్, నీరజ్ చోప్రా లను కోరుతూ ట్వీట్ చేశాడు.
मैं भी अपनी बहन और देश की बेटी के लिए पदम् श्री लौटा दूँगा, माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को, मुझे गर्व है आपकी बेटी और अपनी बहन @SakshiMalik पर… जी क्यों…?
पर देश के सबसे उच्च खिलाड़ियों से भी अनुरोध करूँगा वो भी अपना निर्णय दे…@sachin_rt @Neeraj_chopra1 pic.twitter.com/MfVeYdqnkL
— Virender Singh (@GoongaPahalwan) December 22, 2023
కుస్తీ రంగంలో దేశానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం వీరేందర్ సింగ్‌ను 2015లో అర్జున అవార్డుతో సత్కరించింది. 2021లో అతడిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అభిమానులు గూంగా పహిల్వాన్ అని పిలుచుకునే వీరేందర్ సింగ్.. 2005 మెల్బోర్న్, 2013 తైవాన్, 2017 టర్కీ డెఫ్లింపిక్స్ లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2009 తైవాన్ డెఫ్లింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న అతడు.. వరల్డ్ డెఫ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భాగంగా సిల్వర్ (2008), బ్రౌన్ (2012), గోల్డ్ (2016) మెడల్స్‌తో సత్తా చాటాడు.