గతేడాది భారత్ వేదికగా ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గాన్ చేతిలో ఓటమి నుంచి తృటిలో తప్పించుకున్న కంగారూలు.. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం తోకముడవక తప్పలేదు. ఏడున్నర నెలల తర్వాత ఈ రెండు జట్ల మధ్య ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ సమిష్టిగా రాణించి చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ సమయోచిత ఇన్నింగ్స్‌కు తోడు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు చూపిన పట్టుదలకు పటిష్ట ఆస్ట్రేలియా లొంగక తప్పలేదు. వన్డే ప్రపంచకప్‌లో మాదిరిగానే మ్యాక్స్‌వెల్ ఆసీస్‌ను ఒడ్డుకు చేర్చాలని చూసినా కాబూలీలు ఈసారి మాత్రం ‘పట్టు’ వీడలేదు. గుల్బాదిన్ సంచలన స్పెల్‌తో పాటు నవీనుల్ హక్ పేస్‌తో విజృంభించి ఆసీస్‌ను ఓడించడంతో గ్రూప్-1లో సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
T20 World Cup | సెయింట్ విన్సెంట్: గత కొంతకాలంగా నిలకడైన ఆటతీరుతో అగ్రశ్రేణి జట్లను ఓడిస్తూ సంచలనాలు నమోదుచేస్తున్న అఫ్గానిస్థాన్ తాజాగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాకూ ఆ రుచి చూపించింది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు.. ఇప్పుడు ఆసీస్‌నూ ఓడించింది. సెయింట్ విన్సెంట్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 21 పరుగులతో ఓడించి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ఆ జట్టు నిర్దేశించిన 149 పరుగుల స్వల్ప ఛేదనలో భారీ హిట్టర్లు కలిగిన ఆసీస్.. 19.2 ఓవర్లలో 127 పరుగులకే చేతులెత్తేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (41 బంతుల్లో 59, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గుల్బాదిన్ నయిబ్ (4/20), నవీనుల్ హక్ (3/20) పేస్‌కు ఆసీస్ నిలబడలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. రెహ్మనుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 60, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (48 బంతుల్లో 51, 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
నవీనుల్, గుల్బాదిన్ దెబ్బకు విలవిల:
ఛేదించాల్సిన లక్ష్యమేమీ పెద్దది కాదు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే అసలు అది లెక్కలోకే రాదు. కానీ నవీనుల్ హక్ తొలి ఓవర్ మూడో బంతికే ప్రమాదకర ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి కంగారుల వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (12) వస్తూనే రెండు ఫోర్లు కొట్టినా.. నవీన్ 3వ ఓవర్లో మిడాఫ్ వద్ద నబీకి చిక్కాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సీనియర్ స్పిన్నర్ నబీ.. తొలి బంతికే వార్నర్ (3)ను వెనక్కిపంపాడు.
ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌తో జతకలిసిన స్టోయినిస్ (11) 5 ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. గుల్బాదిన్ రాకతో ఆసీస్ ఇన్నింగ్స్ రూపురేఖలు మారిపోయాయి. 11వ ఓవర్లో అతడు వేసిన షార్ట్ బాల్‌ను ఆడబోయిన స్టోయినిస్ కీపర్ గుర్బాజ్‌కు చిక్కడంతో 39 పరుగుల 4 వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క ఆసీస్ బ్యాటర్ రెండంకెల స్కోరూ చేయలేదు. సహచరులు వెనుదిరుగుతున్నా అర్ధసెంచరీ పూర్తిచేసిన మ్యాక్స్‌వెల్ సైతం గుల్బాదిన్ 15వ ఓవర్లో నూర్ అహ్మద్ అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. టిమ్ డేవిడ్ (2), మాథ్యూ వేడ్ (5) నిష్క్రమణతో ఆసీస్ ఓటమి ఖరారైంది.
గుర్బాజ్, జద్రాన్ సూపర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పటిష్టమైన ఆసీస్ బౌలింగ్‌ను ఈ ఇద్దరూ సమర్థవంతంగా ఎదుర్కుని తొలి వికెట్‌కు శతాధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెజెల్‌వుడ్, కమిన్స్, జంపా, స్టోయినిస్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లున్నా అఫ్గాన్ ఓపెనర్లు 15.5 ఓవర్ల దాకా బ్యాటింగ్ చేయగలిగారంటే ఈ ద్వయం ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించకున్నా ఈ ఇద్దరూ వికెట్‌ను కాపాడుకుంటూ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తారు. అర్ధసెంచరీల తర్వాత స్టోయినిస్ 16వ ఓవర్లో గుర్బాజ్ ఔట్ అవడంతో 118 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కమిన్స్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్..
బంగ్లాదేశ్‌తో గత మ్యాచ్‌లో మాదిరిగానే అఫ్గాన్తోనూ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. 18వ ఓవర్లో ఆఖరి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసిన అతడు.. చివరి ఓవర్ తొలి రెండు బంతుల్లో కరీమ్ జనత్ (13), గుల్బాదిన్‌ను ఔట్ చేసి బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ సాధించాడు.
రేసు రసవత్తరం!
అఫ్గాన్, ఆసీస్ మ్యాచ్ ఫలితం తర్వాత గ్రూప్-1లో సెమీస్ రేసు రసవత్తరంగా మారింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండింటినీ గెలిచిన భారత్ 4 పాయింట్లతో పాటు మెరుగైన నెట్ రన్‌రేట్ (+2.425)తో అగ్రస్థానంలో సెమీస్ రేసును దాదాపుగా ఖాయం చేసుకుంది. కానీ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి నెగ్గిన ఆసీస్, అఫ్గాన్‌లో ఏ జట్టు సెమీస్ చేరుతుందనేది ఆసక్తికరం. కంగారూలు తమ తర్వాతి మ్యాచ్‌ను సోమవారం భారత్‌తో ఆడనుండగా అఫ్గాన్.. బంగ్లాతో తలపడనుంది. టీమ్ఇండియాపై ఆసీస్ ఓడి బంగ్లాపై రషీద్ ఖాన్ సేన గెలిస్తే అఫ్గాన్ నయా చరిత్ర సృష్టించినట్టే! ఒకవేళ ఆసీస్ భారత్‌ను ఓడిస్తే.. అప్పుడు బంగ్లాపై అఫ్గాన్ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (-0.650) కంటే ఆసీస్ (+0.223) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లలో అఫ్గాన్, ఆసీస్ రెండూ తమ ప్రత్యర్థులను ఓడిస్తే అప్పుడూ (మూడు జట్లూ 2 విజయాలతో సమానంగా) నెట్ రన్ రేట్ అత్యంత కీలకమవుతుంది.
1 ఆస్ట్రేలియాతో ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్‌లలో అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం.
సంక్షిప్త స్కోర్లు:
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 148/6 (గుర్బాజ్ 60, జద్రాన్ 51, కమిన్స్ 3/28, జంపా 2/28). ఆస్ట్రేలియా: 19.2 ఓవర్లలో 127 ఆలౌట్ (మ్యాక్స్‌వెల్ 59, మార్ష్ 12, గుల్బాదిన్ 4/20, నవీనుల్ 3/20)