వన్డే ప్రపంచకప్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. ఏకపక్షంగా సాగుతుందని భావించిన పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను అఫ్గానిస్థాన్ ఊహించని దెబ్బకొట్టింది!మొదట బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి మంచి స్కోరు సాధించగా.. ఆనక అఫ్గాన్ బౌలర్లు ఇంగ్లిష్ ప్లేయర్లను చెడుగుడు ఆడుకున్నారు. ముజీబ్, రషీద్, నబితో కూడిన స్పిన్ త్రయం విజృంభణతో ఇంగ్లండ్ విలవిలలాడింది!!
ఇటీవలి కాలంలో ‘బజ్‌బాల్’ ఆటతీరుతో బాదుడే పరమావధిగా విరుచుకుపడుతున్న ఇంగ్లండ్ పప్పులు.. కాబూలీల ముందు ఉడకలేదు. బట్లర్, రూట్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, కరన్ ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో అఫ్గానిస్థాన్ తమ క్రికెట్ చరిత్రలోనే గుర్తుంచుకోదగ్గ విజయం నమోదు చేసుకుంది!!!
CWC | న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్‌గా వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 69 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న అఫ్గాన్.. సంపూర్ణ ఆధిపత్యంతో ప్రపంచ చాంపియన్లను చిత్తుచేసి తమ దేశ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఈ మెగాటోర్నీలో రెండు పరాజయాల తర్వాత అఫ్గాన్‌కు ఇది తొలి గెలుపు కాగా.. ఇంగ్లండ్‌కు మూడు మ్యాచ్‌ల్లో రెండో ఓటమి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (57 బంతుల్లో 80; 98 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా.. వికెట్ కీపర్ ఇక్రామ్ (58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివర్లో ముజీబ్ ఉర్ రహమాన్ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రషీద్ ఖాన్ (23; 3 ఫోర్లు) విలువైన పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్ వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (66; 7 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. డేవిడ్ మలాన్ (32) పర్వాలేదనిపించాడు. అఫ్గాన్ స్పిన్ త్రయం రషీద్ (3/37), ముజీబ్ (3/51), మహమ్మద్ నబీ (2/16) దుమ్మురేపారు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో అదరగొట్టిన ముజీబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
నేలకు దించారు!
అంతర్జాతీయ క్రికెట్‌కు ‘బజ్‌బాల్’ను పరిచయం చేసి.. ఇటీవల వన్డేల్లో తరచూ భారీ స్కోర్లు చేస్తున్న ఇంగ్లండ్ జట్టు ముందు అఫ్గాన్ 285 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సీజన్లో బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారిన ఢిల్లీ పిచ్‌పై హిట్టర్లతో కూడిన ఇంగ్లిష్ జట్టుకు ఇదొక లెక్కా అని అభిమానులు భావిస్తే.. అక్కడే అఫ్గాన్ అద్భుతం చేసింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, టీమ్ఇండియా ప్లేయర్లు భారీ షాట్లతో విరుచుకుపడి పరుగుల వరద పారించగా.. ఇంగ్లండ్ మాత్రం అందుకు భిన్నంగా వరుస వికెట్లు కోల్పోయింది. ఈ ఘనత మాత్రం కాబూలీలకే దక్కుతుంది. ఒక్కో ప్లేయర్‌ను ఒక్కో ప్రణాళికతో బుట్టలో వేసుకున్న తీరు ఎంత మెచ్చుకున్నా తక్కువే! ఈసారి ప్రపంచకప్‌లో మా దమ్మేంటో చూపుతామని.. టోర్నీకి ముందే ప్రకటించిన అఫ్గాన్.. అందుకు తగ్గట్లే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇప్పటికే తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన బట్లర్ సేన ఆత్మవిశ్వాసంపై ఈ ఫలితం భారీ ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు.
సాధారణంగా బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించే అఫ్గాన్ ఈ పోరులో సమిష్టిగా సత్తాచాటింది. రహ్మానుల్లా మెరుపు ఆరంభాన్నివ్వగా.. ఆ తర్వత వరుస వికెట్లు కోల్పోయినా.. లోయర్ ఆర్డర్‌తో కలిసి ఇక్రామ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇక చివర్లో రషీద్, ముజీబ్ జోడించిన పరుగులే ఈ మ్యాచ్‌లో కీలకమయ్యాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బౌలింగ్‌లో తమ ప్రధాన అస్త్రమైన స్పిన్‌ను ఆ జట్టు సమర్థవంతంగా వినియోగించుకుంది. ముజీబ్‌తో బౌలింగ్ దాడీ ప్రారంభించిన.. అఫ్గాన్ ఏ దశలోనూ ఇంగ్లండ్‌ను కోలుకోనివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పకడ్బందీ ఫీల్డింగ్ తోడవడంతో బట్లర్ సేన ఆటలు సాగలేదు. ఇంగ్లండ్ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన స్టార్ బ్యాటర్ జొనాథన్ ట్రాట్.. ప్రస్తుతం అఫ్గాన్ కోచ్‌గా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. 2011లో భారత్ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన.. ఇంగ్లండ్ మళ్లీ ఇక్కడే జరిగిన మెగాటోర్నీలో మరో చిన్న జట్టులో చేతిలో ఓడటం కొసమెరుపు.
అప్పుడలా.. ఇప్పుడిలా!
2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన పోరులో ఇంగ్లిష్ టీమ్ భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) రికార్డు సెంచరీ నమోదు చేసుకోగా.. జో రూట్ (88), జానీ బెయిర్‌స్టో (90) దంచికొట్టారు. దీంతో ఇంగ్లండ్ 6 వికెట్లకు 397 పరుగులు చేసింది. ఆనక అఫ్గానిస్థాన్ 247 పరుగులకే పరిమితమై.. 150 రన్స్ తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లను టార్గెట్ చేసుకొని ఊచకోత కోసిన ఇంగ్లండ్ ఆటగాళ్లను.. ఈసారి అఫ్గాన్ అదే స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ మ్యాచ్‌లో రషీద్, ముజీబ్, నబీ కలిసి 224 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోగా.. తాజా మ్యాచ్‌లో 104 పరుగులిచ్చిన ఈ త్రయం ఎనిమిది మందిని పెవిలియన్‌కు పంపి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్: 49.5 ఓవర్లలో 284 (రహ్మానుల్లా 80, ఇక్రామ్ 58; ఆదిల్ రషీద్ 3/42, మార్క్‌వుడ్ 2/50), ఇంగ్లండ్: 40.3 ఓవర్లలో 215 (బ్రూక్ 66, మలాన్ 32; రషీద్ 3/37, ముజీబ్ 3/51).