Pankaj Advani : భారత స్టార్ బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ(Pankaj Advani) వరల్డ్ స్నూకర్ నాకౌట్ పోటీలకు అర్హత సాధించాడు. ఐబీఎస్ఎఫ్ వరల్డ్ 6- రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్(IBSF World 6-Red Snooker Championship) టోర్నీకి క్వాలిఫై అయ్యాడు. బిలియర్డ్స్, స్నూకర్‌లో ఇప్పటివరకూ 20కి పైగా వరల్డ్ టైటిళ్లు గెలుపొందిన అద్వానీ ఈ పోటీల్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.
భారత్‌కే చెందిన డిఫెండింగ్ చాంపియన్ ఎస్ శ్రీకృష్ణ కూడా నాకౌట్‌కు క్వాలిఫై అయ్యాడు. ఈ టోర్నీలో ఇరాన్‌కు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ అమిర్ సర్కోశ్(Amir Sarkhosh) సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఢిల్లీలో జరిగిన అర్హత పోటీల్లో అద్వానీ అదరగొట్టాడు. 4-1, 4-0తో గెలుపొంది గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవడంతో అతడికి బై లభించింది. దాంతో, అద్వానీ నేరుగా లాస్ట్ -16లో చోటు దక్కించుకున్నాడు. ఒక రౌండ్లో ఓడిపోయిన శ్రీకృష్ణ నాకౌట్ దశలో మరొక రౌండ్ ఆడనున్నాడు.