హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్షిప్లో అదితి గోపీచంద్, ఓజాస్ ప్రవీణ్ విజేతలుగా నిలిచారు. సోమవారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో అదితి గోపీచంద్(మహారాష్ట్ర)146-145తో సాక్షి(ఉత్తరప్రదేశ్)పై గెలిచింది. ఇదే విభాగంలో మధుర ధమన్ గోవాన్కర్(మహారాష్ట్ర)కు కాంస్యం దక్కింది.
పురుషుల వ్యక్తిగత ఫైనల్లో ఓజాస్ ప్రవీణ్ 150-148తో అభిషేక్వర్మ(ఢిల్లీ)పై గెలిచి పసిడి సొంతం చేసుకోగా, సాహిల్ రాజేశ్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ విభాగంలో అభిషేక్వర్మ, ప్రియాన్షు, అమన్సైనీ, రితిక్ చాహాల్ బృందం పసిడి సొంతం చేసుకుంది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గుస్తి నోరియా, ఆర్చరీ సంఘం అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి అరవింద్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.