Paris Olympics | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ అర్హత సాధించారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటూ విశ్వక్రీడలకు సోమవారం బెర్తులు ప్రకటించారు. నిలకడగా రాణిస్తున్న అదితికి ఇది మూడో ఒలింపిక్స్ కాగా, దీక్షకు ఇది రెండోది. గత ఒలింపిక్స్(టోక్యో)లో అదితి నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతక అవకాశాన్ని చేజార్చుకుంది. మరోవైపు పురుషుల విభాగంలో భారత్ నుంచి శుభాంకర్శర్మ, గగన్‌జీత్ భుల్లార్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
త్వరలో హెచ్‌సీఏ ఓపెన్ సెలెక్షన్స్
హైదరాబాద్: ఉమెన్స్ లీగ్ కోసం వర్ధమాన మహిళా క్రికెటర్లను ఎంపిక చేసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సిద్ధమైంది. ఇందు కోసం ఈనెల 29, 30 తేదీల్లో ఓపెన్ సెలెక్షన్స్ నిర్వహించనున్నట్లు హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్ సోమవారం వెల్లడించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెలెక్షన్స్ జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రికెటర్లు సోమవారం నుంచి www.hyc.cricket.in అనే వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.