దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచినా ఇంకా భారత్ చేరని ట్రోఫీపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్‌గా ఉన్న పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఆ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయం నుంచి మరో చోటుకు తరలించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇటీవలే దుబాయ్‌కు వెళ్లి ట్రోఫీ గురించి ఆరాతీస్తే దానిని నఖ్వీ అబుదాబిలో తన అనుచరుల వద్ద ఉంచారని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘గత వారం మా ప్రతినిధి ఒకరు ఏసీసీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి ట్రోఫీ గురించి ఆరా తీశాడు. కానీ ట్రోఫీ అక్కడ లేదని.. దానిని నఖ్వీ అబుదాబిలోని వేరే చోటుకు తరలించాడని అక్కడివారు చెప్పారు’ అని తెలిపారు. ట్రోఫీని తమకు అందజేయాలని ఇటీవలే బీసీసీఐ.. నఖ్వీకి లేఖ రాయగా శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డులు సైతం భారత్‌కు మద్దతుగా నిలిచిన విషయం విదితమే.