ముంబై: ఐపీఎల్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యలనూ బీసీసీఐ ఉపేక్షించదని, నిబంధనలను ఉల్లంఘించే జట్లు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ (ఈ-సిగరెట్) చేయడం, ఆ జట్టు మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో మొబైల్ ఫోన్ ఉపయోగించిన ఘటనలపై సైకియా స్పందించారు. ఆటగాళ్లు, అధికారులు లీగ్ పేరు చెడగొట్టే పనులు చేయకుండా ఆయా జట్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కట్టు తప్పిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఐపీఎల్ నిబంధనల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలపై బోర్డు త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక, ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని సైకియా తెలిపారు.