టోక్యో : తుపాకీ గురి పెడితే పతకాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా సాగుతున్న భారత షూటర్లు.. టోక్యోలో జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం జరిగిన పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో అభినవ్ దేశ్వాల్, ప్రంజలి ప్రశాంత్ జోడీ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో భారత జంట.. 16-6తో యా-జు కావ్, మింగ్-జుయ్ సు (చైనీస్ తైఫీ)ను ఓడించి పసిడి నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ పోటీల్లో కుశాగ్ర సింగ్ రజావత్.. కాంస్యం సాధించాడు. ఫైనల్లో అతడు.. 224.3 పాయింట్లు స్కోరు చేశాడు. వీరి ప్రదర్శనతో ఈ టోర్నీలో భారత పతకాల సంఖ్య 11కు చేరింది.