అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికర పోరాటానికి తెరలేచింది. టోర్నీకే హైలైట్‌గా నిలిచే పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ చావోరేవో తేల్చుకోనుంది. తొలి పోరులో వేల్స్‌పై గెలిచిన తర్వాత ఇంగ్లండ్ చేతిలో ఓడిన భారత జట్టు బుధవారం జరిగే పూల్-డీ ఆఖరి పోరులో పాక్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గినా.. కనీసం డ్రా చేసుకున్నా హర్మన్‌సేన తదుపరి రౌండ్ చేరుకుంటుంది. ఓడితే ఇంటిదారి పడుతుంది. దాంతో దశాబ్ద కాలంగా పాకిస్తాన్‌పై కొనసాగుతున్న అజేయ పరంపరను నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాలని హర్మన్‌సేన భావిస్తుండగా, భారత్‌ను నాకౌట్ చేయాలని పాక్ ఆశిస్తోంది.
అయితే, ఇటీవలి కాలంలో దాయాది జట్టుపై భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రో లీగ్ యూరోపియన్ లెగ్‌లో పాక్‌ను 7-1, 4-3 తేడాతో ఓడించింది. 2016 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత పాక్ ఇప్పటివరకు మన జట్టుపై నెగ్గలేదు. దాంతో ఇంగ్లండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని మరోసారి పాక్ పని పట్టాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది.
మహిళల ప్రపంచకప్‌లో భారత్ అదరగొట్టింది. మంగళవారం జరిగిన పూల్-డీ రెండో పోరులో 6-1తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం జరిగే పూల్ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.