క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ గెలిచి కొత్త చరిత్రకు నాంది పలికిన టీమ్ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మారింది. సుదీర్ఘ ఫార్మాట్లో నిలకడైన విజయాలతో ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన కోహ్లీసేన..న్యూజిలాండ్ చేతిలో ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉండగా కరోనా కలకలంతో ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ గెలుపును ఆస్వాదించలేకపోయింది. పొట్టి ఫార్మాట్లో ఎలాగైనా ప్రపంచకప్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగిన కోహ్లీసేన..గ్రూపు దశలోనే వెనుదిరగడం సగటు అభిమానిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. టీ20 కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు, చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీ విరమణ, ఆ తర్వాత కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నేతృత్వంలో కివీస్‌పై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్, వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను అనూహ్యంగా తొలగించడం, రోహిత్‌కు టెస్టు వైస్ కెప్టెన్సీ. ఆ తర్వాత బోర్డు వైఖరిని మీడియా ఎదుట చీల్చిచెండాడిన కోహ్లీ…బీసీసీఐ పెద్దలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించిన తీరు ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యేక కథనం.
ఆసీస్ గడ్డపై కొత్త చరిత్ర
ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. కొరకరాని కొయ్యగా మారిన కంగారూలపై టెస్టు సిరీస్ గెలిచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుని ఔరా అనిపించింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి టెస్టుల్లో కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా పేలవ ప్రదర్శన మూటగట్టుకుంది. హాజిల్‌వుడ్(5/8), కమిన్స్(4/21) ధాటికి భారత బ్యాటింగ్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. ఒక్కరంటే ఒక్కరు కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారంటే మన బ్యాటింగ్ ఎంత అధ్వానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అడిలైడ్ టెస్టు తర్వాత పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి రాగా.. మిగిలిన మూడు టెస్టులకు రహానే సారథిగా వ్యవహరించాడు. ఓవైపు కోహ్లీతో పాటు రోహిత్‌శర్మ లేకపోవడం బౌలర్లు ఒకరి తరువాత ఒకరు గాయపడినా..భారత్ పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. కోహ్లీ లేని లోటు ఏ మాత్రం కనిపించకుండా రహానే జట్టును నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మెల్బోర్న్ టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమ్ఇండియా వెనుదిరిగి చూసుకోలేదు. మూడో (సిడ్నీ) టెస్టు డ్రాగా ముగిసినా..ఆఖరిదైన నాలుగో టెస్టు (గబ్బా)లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది.
కెప్టెన్సీ మార్పు
భారత కెప్టెన్ల మార్పు బీసీసీఐలో పెద్ద అలజడి రేపింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ వద్దన్న తప్పుకున్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో పేర్కొనడం వివాదానికి కారణమైంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లఅనూహ్య నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని ఉన్నఫళంగా తప్పిస్తూ రోహిత్‌శర్మకు బాధ్యతలు అప్పగించడం, టెస్టులకు హిట్‌మ్యాన్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించడంతో అగ్గి రాజుకుంది. దీనిపై సఫారీ పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ తనదైన రీతిలో బోర్డు వ్యవహారశైలిని ఎండగట్టాడు. బీసీసీఐ బాస్ గంగూలీ మాటకు పూర్తి వ్యతిరేకంగా సెలెక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు కెప్టెన్సీ నుంచి తప్పించారని విరాట్ బాంబు పేల్చాడు.