హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ బౌల్డర్‌హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా పీజీటీఐ ఆధ్వర్యంలో గోల్ఫ్ టోర్నీకి తెరలేవనుంది. ఈ నెల 17వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో వివిధ దేశాలకు చెందిన దాదాపు 132 మంది ఫ్రొఫెషనల్ గోల్ఫర్లు పోటీపడుతున్నారు. భారత్ నుంచి స్టార్ గోల్ఫర్లు శుభాంకర్శర్మ, యువరాజ్ సంధు టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.
టోర్నీకి సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీజీటీఐ అధ్యక్షుడు కపిల్‌దేవ్ మాట్లాడుతూ ‘గోల్ఫ్ అనేది సంపన్నుల క్రీడ మాత్రమే కాదు, ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎవరైనా రాణించవచ్చు. క్రికెట్ మాదిరి బుమ్రా లాంటి బౌలర్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయం గోల్ఫ్‌లో ఉండదు’ అని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో ప్రైజ్‌మనీగా కోటి రూపాయలు ప్రకటించారు.