న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుతో ఇప్పటికే దాదాపు రెండొందల కోట్లు నష్టపోయిన భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఇప్పుడు మరోసారి ప్రమాదం అంచుల్లో ఉంది. వచ్చే ఏడాది మనదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. దీనికి సంబంధించిన ప్రసారాల ద్వారా సమకూరే ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం 21.84 శాతం పన్ను విధించింది. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు ఆతిథ్య దేశాలు పన్ను మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణించడం లేదు. దీంతో బీసీసీఐకి రూ.955 కోట్ల నష్టం వాటిల్లనుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు కూడా పన్ను మినహాయింపు ఇవ్వలేదు. దీంతో బోర్డు రూ. 193 కోట్లు నష్టపోయింది.