హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పోలీస్ విభాగం ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక 74వ బీఎన్ మల్లిక్ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభిస్తారని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. 12 రోజుల పాటు సాగే టోర్నీలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి 43 జట్లు పోటీలో ఉంటాయని అన్నారు.
ఇందులో 851 మంది పురుషులు, 187 మంది మహిళా ప్లేయర్లు బరిలో ఉంటారని తెలిపారు. నగరంలోని ఐదు ప్రధాన వేదికలు గచ్చిబౌలి స్టేడియం, గోల్కొండలోని హెచ్ఎఫ్సీ స్టేడియం, సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ గ్రౌండ్, శ్రీనిధి ఫుట్‌బాల్ స్టేడియం, గోల్కొండలోని ఆర్టిలరీ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ కోసం భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్, స్టార్ ప్లేయర్ గుగులోతు సౌమ్య, మాజీ భారత కోచ్ నయీముద్దీన్ పాల్గొంటారని తెలిపారు.