IPL | బెంగళూరు: రానున్న ఐపీఎల్ సీజన్లో ప్లేయర్లపై కనకవర్షం కురిసే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ప్లేయర్లకు మరింత ఆర్థిక లబ్ధి జరిగేలా నిర్వహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆదివారం బీసీసీఐ ఏజీఎమ్‌తో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ జరుగనుంది. ఇందులో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేలంలో ఒక్కో జట్టు ఎక్కువలో ఎక్కువ ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవడంతో పాటు రైట్ టు మ్యాచ్ కార్డ్ ప్రయోగించే చాన్స్ ఇవ్వనున్నారు. దీనికి తోడు లీగ్‌లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5లక్షలు, మొత్తం మ్యాచ్‌లు ఆడితే 1.05 కోట్లు దక్కుతాయని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. అదనంగా ఒక్కో ఫ్రాంచైజీ 12.60 కోట్లు మ్యాచ్ ఫీజుగా కేటాయించనున్నారు.
బోపన్న జోడీ ఔట్
బీజింగ్: చైనా ఏటీపీ ఓపెన్ టోర్నీలో రోహన్‌బోపన్న, ఇవాన్ డోడిగ్ జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న, డోడిగ్ ద్వయం 5-7, 6-7తో ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో, నికోలస్ జారీ ద్వయం చేతిలో ఓటమిపాలైంది. గంటన్నర పాటు సాగిన పోరులో బోపన్న, డోడిగ్కు అన్‌సీడెడ్ ప్రత్యర్థి నుంచి ఊహించని రీతిలో ఓటమి ఎదురైంది. ఇదిలా ఉంటే 44 ఏండ్ల బోపన్న ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, మియామి ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే.