హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 18: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ ఎస్)లో మూడురోజులుగా జరిగిన 5వ ఓపెన్ నేషనల్ అండర్ -23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి. దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ టోర్నీలో అథ్లెట్లు బంగారు పతకమే లక్ష్యంగా దూసుకెళ్లారు. జేఎన్ఎస్ వేదికగా గతంలో ఎన్నడూలేనివిధంగా రికార్డులను బ్రేక్ చేశారు.
చివరిరోజు 16 ఈవెంట్లలో పోటీలు జరిగాయి. 5 వేల మీటర్ల పరుగు పందెం, 200 మీటర్లు, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో, 400 మీటర్స్ హార్డిల్స్, హామ్మర్త్రో, ట్రిపుల్ జంప్, 800 మీటర్లు, 3 వేల మీటర్స్ మెన్ అండ్ ఉమెన్స్‌కు పోటీలు నిర్వహించగా సత్తాచాటిన విజేతలకు నిర్వాహకులు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ.. మూడు రోజుల జాతీయ పోటీల్లో దేశ వ్యాప్తంగా సీనియర్ అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించారన్నారు.