సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 14: కంది ఐఐటీ హైదరాబాద్‌లో 58వ ఇంటర్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని 23 ఐఐటీల నుంచి 2500 మంది ప్లేయర్లు ఇందులో పోటీపడుతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీనసియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆమె ఈ పోటీలను ప్రారంభించారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఐఐటీ హైదరాబాద్‌లోని ఆథ్లెటిక్స్ గ్రౌండ్లో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమైంది.
ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు జరుగనున్నాయి.ఈనెల 24 నుంచి 29 వరకు దాదాపు 2 వేల మంది సిబ్బంది పాల్గొనే 30వ ఇంటర్ ఐఐటీ స్టాఫ్ స్పోర్ట్స్ మీట్ జరగనున్నది. వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా సైనిక బ్యాండ్లతో ఐఐటీ బృందాల గ్రాండ్ మార్చ్ ఫాస్ట్, స్పిక్ మెకేతో సహా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ప్రముఖుల ప్రసంగాలు క్రీడాకారులను ఆకట్టుకున్నాయి.