లాడర్‌హిల్(యూఎస్ఏ) : వెస్టిండీస్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. ఆస్ట్రేలియాతో టెస్టు, టీ20 సిరీస్‌ల్లో వైట్‌వాష్ ఎదుర్కొన్న విండీస్..పాకిస్థాన్‌పై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ఆదివారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో పాక్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ కాస్తా ప్రస్తుతం 1-1తో సమమైంది. పాక్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు అలిక్ అతానజె(2), జెవెల్ అండ్రూ(12) ఘోరంగా విఫలమవగా, కెప్టెన్ షాయ్‌హోప్(21), రోస్టన్ చేజ్(16), మోతీ(28) జట్టును పోటీలో నిలిపారు.
చివర్లో రొమారియో షెఫర్డ్(15)తో కలిసి జాసన్ హోల్డర్(16 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఫోర్ కొట్టిన హోల్డర్ జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. నవాజ్, సయిమ్ ఆయూబ్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు హోల్డర్(4-19) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 133-9 స్కోరు చేసింది. హసన్ నవాజ్(40), ఫకర్ జమాన్(20) రాణించారు. హోల్డర్ బౌలింగ్ ధాటికి పాక్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించిన హోల్డర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 సోమవారం జరుగనుంది.