Vignesh Puthur | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేదు. దేశవాళీలోనూ ఒక్క మ్యాచ్ ఆడలేదు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన అనుభవమూ తక్కువే. అవతలి వైపు చూస్తే ఎంతటి బౌలర్‌నైనా చిత్తుచేసే బ్యాటింగ్ దళం. స్పిన్నర్లను మిక్సీలో వేసి తాఫీగా జ్యూస్ చేసుకుని తాగే బ్యాటర్లు. క్రీజులో రుతురాజ్ దంచుతుంటే ఇక మ్యాచ్ ముగిసినట్టే! అనుకుంటున్న చెన్నై ఇన్నింగ్స్‌లో భారీ కుదుపు. ముంబై సారథి సూర్య చేతి నుంచి బంతినందుకున్న 24 ఏండ్ల కుర్రాడు.. సీఎస్కేను ముప్పు తిప్పలు పెట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత దిగ్గజ సారథి ధోనీ ప్రశంసలు అందుకున్న కేరళ కుర్రాడు విఘ్నేశ్ పుతుర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్.
ఐపీఎల్ అంటే ధోనీ, రోహిత్, కోహ్లీ, స్టార్క్, మిల్లర్, బట్లర్ వంటి అంతర్జాతీయ స్టార్లే కాదు. ఎంతోమంది ఔత్సాహిక క్రికెటర్లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు ఈ లీగ్‌ను మించిన వేదిక మరొకటి ఉండదు. ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న క్రికెటర్లు ఎంతోమంది.. తాజాగా ఆ జాబితాలో చేరేందుకు నేనున్నానని దూసుకొచ్చాడు విఘ్నేశ్ పుతుర్. 24 ఏండ్ల ఈ మళప్పురం (కేరళ) కుర్రాడు.. ఆదివారం చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ఆరంభ మ్యాచ్‌లోనే అదరహో అనిపించాడు. స్పిన్‌ను బాగా ఆడగలరన్న పేరున్న రుతురాజ్, దూబె, దీపక్ హుడా వంటి బ్యాటర్లను ఔట్ చేసి ముంబైని రేసులోకి తీసుకొచ్చాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా విఘ్నేశ్ స్పిన్‌కు మహేంద్రసింగ్ ధోనీ కూడా ఫిదా అయ్యాడంటే ఈ కుర్రాడి అమ్ములపొదిలో ఇంకా ఎన్ని అస్ర్తాలు దాగున్నాయో!
కాళికట్ యూనివర్సిటీలో ఎంఏ లిటరేచర్ (ఇంగ్లీష్) చదువుతున్న విఘ్నేశ్ది సాధారణ మధ్య తరగతి కుటుంబం. తండ్రి సునీల్ కుమార్ ఆటో డ్రైవర్. తల్లి బింధు గృహిణి. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న విఘ్నేశ్.. ఆటలో మెళుకువల కోసం మళప్పురం నుంచి త్రిసూర్‌కు మారిపోయాడు. కాలేజీ స్థాయిలో రాణించిన ఈ కుర్రాడు.. కేరళ క్రికెట్ లీగ్‌లో ఆడటం అతడికి కలిసొచ్చింది. ముంబై ఇండియన్స్ బృందం అతడిలోని ప్రతిభను గుర్తించింది ఇక్కడే. ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్ లోనూ సత్తా చాటిన విఘ్నేశ్‌ను ఐపీఎల్ వేలంలో ముంబై రూ.30 లక్షల ధరతో దక్కించుకుంది. కేరళ తరఫున సీనియర్ క్రికెట్లో ఆడే అవకాశం రాని అతడు.. అండర్-23 జట్టుకు మాత్రం ఆడాడు.
విఘ్నేశ్ ప్రతిభను గుర్తించిన ముంబై.. వేలంలో దక్కించుకోగానే అతడిని సానబెట్టింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20)కు గాను డర్బన్ విమానమెక్కించింది. అక్కడ విఘ్నేశ్ ఎంఐ కేప్‌టౌన్ జట్టుకు నెట్ బౌలర్‌గా సేవలందించాడు. రషీద్ ఖాన్ వంటి స్పిన్నర్‌తో కలిసి బౌలింగ్ వేయడం విఘ్నేశ్‌కు కలిసొచ్చింది. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన విఘ్నేశ్‌ను ఎదుర్కోవడానికి నెట్స్‌లో రోహిత్, సూర్య వంటి మేటి బ్యాటర్లు కూడా ఇబ్బంది పడటంతో చెన్నైతో ఆడేందుకు అతడికి లైన్ క్లియర్ అయింది. అతడు సంధించే ైప్లెటెడ్ డెలివరీలు, గూగ్లీలకు సమాధానమేలేకుండా పోయింది.