న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న మెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు (T20 world cup) వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించున్నారు. వరల్డ్ కప్ (World cup) షెడ్యూల్ ఇంకా ఖరారుకానప్పటికీ.. టోర్నీ తేదీలను ఐసీసీ (ICC) ప్రకటించింది. 2024, జూన్ 4 నుంచి 30 వరకు మ్యాచ్‌లు జరుగుతాయని వెల్లడించింది. కప్ కోసం మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటికే 17 జట్లు అర్హత సాధించాయి. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం క్వాలిఫయింగ్ మ్యాచులు జరుగుతుండటంతో మరో మూడు జట్లు ఏవనేది త్వరలో తేలనున్నది.
కాగా, అమెరికా, కరీబియన్ దీవులు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 10 స్టేటియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వాటిలో అమెరికాలోని డల్లాస్ (గ్రాండ్ ప్రైరీ స్టేడియం), మోరిస్విల్లే (చర్చ్ స్ట్రీట్ పార్క్), న్యూయార్క్ (వాన్ కార్ట్‌ల్యాండ్ పార్క్)తోపాటు ఫ్లోరిడాలోని లౌడర్‌హిల్ స్టేడియంలో మ్యాచులు నిర్వహించనున్నారు. అయితే ఈ స్టేడియాలకు ఇంకా అంతర్జాతీయ హోదా ప్రకటించాల్సి ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే వేదికలకు ఇంటర్నేషనల్ హోదా తప్పనిసరి. ప్రస్తుతం ఐసీసీ బృందం ఈ స్టేడియాల్లో ఉన్న సదుపాయాలను పరిశీలిస్తున్నది.
కాగా, టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో గ్రూప్‌లో 5 జట్లకు స్థానం కల్పిస్తారు. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. మళ్లీ వాటిని రెంగు గ్రూప్‌లుగా విభజిస్తారు. వాటిలో టాప్ ప్లేస్‌లో ఉండే నాలుగు టీమ్‌లు సెమీ ఫైనల్స్‌లో తలపడుతాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, అమెరికా జట్లు పోటీలకు అర్హత సాధించాయి. ఐర్లండ్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్లు తాజాగా క్వాలిఫై అయ్యాయి. మరో మూడు జట్లు త్వరలో తేలనున్నాయి. 2022లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.