e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News ప్రతీకార పోరు

ప్రతీకార పోరు

  • ఉదయం 9.30 నుంచి..
  • డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమికి
  • బదులు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా
  • స్పిన్‌ పిచ్‌లపై చరిత్ర సృష్టించాలని కివీస్‌..
  • నేటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు

భారత్‌లో 34 టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌.. ఇప్పటి వరకు కేవలం రెండింట్లో మాత్రమే విజయాలు సాధించింది.
ఈ వేదికపై న్యూజిలాండ్‌కు ఇది నాలుగో టెస్టు. భారత గడ్డపై ఒకే మైదానంలో కివీస్‌ ఆడిన టెస్టుల్లో ఇవే అత్యధికం.
భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్టు విజయం సాధించి 33 ఏండ్లు పూర్తయ్యాయి. చివరి సారిగా కివీస్‌ 1988లో ముంబై టెస్టులో టీమ్‌ఇండియాపై గెలిచింది.

ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మొట్టమొదటి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్‌ఇండియా.. తమకు కొరుకుడు పడని భారత గడ్డపై సత్తాచాటాలని న్యూజిలాండ్‌.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాయి. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమీ వంటి స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. పరిమిత వనరులతోనే అద్భుతం చేయాలని రహానే సేన చూస్తుంటే.. ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో భారత్‌ను దెబ్బ కొట్టాలని విలియమ్సన్‌ గ్యాంగ్‌ భావిస్తున్నది. గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లోని మజాను ఆస్వాదించిన అభిమానులకు నేటి నుంచి సంప్రదాయ క్రికెట్‌ విందు భోజనం వడ్డించనుంది!

- Advertisement -

నా ఫామ్‌ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. జట్టుకు వీలైనంత సహకారం అందించడమే నా పని. అంటే ప్రతీ మ్యాచ్‌లో వంద కొట్టాలని కాదు. ఒక్కో ఇన్నింగ్స్‌లో 30, 40, 50 పరుగులు కూడా విలువైనవే. అతిగా ఆలోచించకుండా మా శైలిలోనే ఆడాలని రాహుల్‌ భాయ్‌ చెప్పాడు. పుజారాకు, నాకు గేమ్‌ ప్లాన్‌పై అవగాహన ఉంది. దాన్ని మైదానంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌ అందుబాటులో లేకపోవడం యువ క్రికెటర్లకు సదావకాశం. వాళ్లు దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి ప్రదర్శన కనబర్చాలి. స్వేచ్చగా ఆడితే పరుగులు వాటంతటవే వస్తాయి. ఇక్కడి పరిస్థితులకు, దక్షిణాఫ్రికా పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి మేం ప్రస్తుతానికి కివీస్‌తో టెస్టు సిరీస్‌పైనే దృష్టి సారించాం. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడటం భారత ఆటగాళ్లకు కూడా ఇబ్బందే. కాకపోతే క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పిచ్‌తో సంతృప్తిగా ఉన్నాం. టాపార్డర్‌లో సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రం చేస్తాడు. రాహుల్‌ గాయపడటం జట్టుకు పెద్ద దెబ్బే.. అయితే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జట్టులో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఓపెనింగ్‌ గురించి చింతించాల్సిన అవసరం లేదు. జట్టు కూర్పు గురించి ఇప్పుడే చెప్పలేను.

అజింక్యా రహానే, భారత కెప్టెన్‌

కాన్పూర్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ఇక్కడి గ్రీన్‌ పార్క్‌ స్టేడియంలో తొలి పోరు ప్రారంభం కానుంది. కివీస్‌ పూర్తి బలగంతో బరిలోకి దిగుతుంటే.. భారత్‌ మాత్రం స్టార్‌ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ బృందంతో యుద్ధానికి రెడీ అయింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న అజింక్యా రహానే.. సారథిగా జట్టును ముందుకు నడిపించనుండగా.. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టెస్టు అరంగేట్రం చేయడం ఖాయమైంది. సొంతగడ్డపై భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుండగా.. న్యూజిలాండ్‌ కూడా ఇదే గేమ్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో కివీస్‌పై టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఇదే జోరులో టెస్టు సిరీస్‌ను పట్టేయాలని చూస్తుంటే.. దానికి బదులు తీర్చుకుంటూ గట్టి పోటీనివ్వాలని న్యూజిలాండ్‌ కృతనిశ్చయంతో ఉంది. పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తిరిగి జట్టుతో చేరడం బ్లాక్‌ క్యాప్స్‌కు కొండంత అండ కాగా.. అజాజ్‌ పటేల్‌, సోమర్‌విల్లే, శాంట్నర్‌ రూపంలో ఆ జట్టుకు సరిపడ స్పిన్‌ వనరులు అందుబాటులో ఉన్నాయి. మరి భారత ఆటగాళ్లు బదులు తీర్చుకుంటారా.. లేక బ్లాక్‌క్యాప్స్‌ విజృంభిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది!

సారథికే సవాల్‌..

కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్న భారత మేనేజ్‌మెంట్‌కు అజింక్యా రహానే ఫామ్‌ ఇబ్బందికరంగా మారింది. కోహ్లీ గైర్హాజరీలో తొలి టెస్టుకు నాయకత్వం వహిస్తున్న రహానే గత కొంతకాలంగా బ్యాట్‌తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. చివరి 11 టెస్టుల్లో అతడు 19 సగటుతో పరుగులు చేయడం మేనేజ్‌మెంట్‌ను ఇరకాటంలో పడేసింది. యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. రహానే ఈ సిరీస్‌లో సత్తాచాటకపోతే.. భవిష్యత్తులో అతడికి జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తున్నది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించని రహానే.. సారథిగా జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలి. అతడితో పాటు మరో సీనియర్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారాపై కూడా ఒత్తిడి అధికంగా ఉంది. కోహ్లీ, రోహిత్‌, రాహుల్‌, పంత్‌ గైర్హాజరీలో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఉంది. మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. ఆ తర్వాత పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌, అజింక్యా రహానే బ్యాటింగ్‌కు రానున్నారు. స్పిన్‌ ఆల్‌రౌండర్ల కోటాలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే కాగా.. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లో ఇద్దరే జట్టులో ఉండనున్నారు.

తక్కువ అంచనా వేయొద్దు..

ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై ఆధిపత్యం కనబర్చిన న్యూజిలాండ్‌.. ఎలాంటి పిచ్‌పైనైనా ప్రభావం చూపగలదు. బ్యాటింగ్‌ మ్యాస్ట్రో కేన్‌ విలియమ్సన్‌తో పాటు రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, బ్లండెల్‌తో ఆ జట్టు టాపార్డర్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నది. ఐపీఎల్‌ వల్ల భారత పిచ్‌లపై అవగాహన ఉండటం బ్లాక్‌క్యాప్స్‌కు అదనపు ప్రయోజనం అందించనుంది. స్పిన్‌ పిచ్‌లపై కూడా రివర్స్‌ స్వింగ్‌ రాబట్టగల టిమ్‌ సౌథీ, నీల్‌ వాగ్నర్‌ అందుబాటులో ఉండటం కివీస్‌కు కలిసొచ్చే అంశం కాగా.. శాంట్నర్‌, సోమర్‌విల్లె, అజాజ్‌ పటేల్‌ రూపంలోఆ జట్టుకు ముగ్గురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు.

పిచ్‌, వాతావరణం

స్పిన్‌ పిచ్‌ సిద్ధం చేయాలని బీసీసీఐ నుంచి కానీ, భారత జట్టు యాజమాన్యం నుంచి కానీ ఎలాంటి సూచనలు అందలేదని గ్రీన్‌పార్క్‌ క్యూరేటర్‌ శివ కుమార్‌ చెబుతున్నా.. కాన్పూర్‌ పిచ్‌ స్పిన్నర్లకు స్వర్గధామం కానుంది. ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన చివరి టెస్టులో అశ్విన్‌-జడేజా జోడీ 16 వికెట్లు పడగొట్టిందంటేనే.. పిచ్‌లో ఎంత టర్న్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రెండు టీమ్‌లు ముగ్గురేసి స్పిన్నర్లను బరిలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు లేదు.

సిరీస్‌లో స్పిన్‌ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటి వాతావరణంలో అజాజ్‌ పటేల్‌, సోమర్‌విల్లే ప్రభావం చూపుతారనుకుంటున్నా. రివర్స్‌ స్వింగ్‌ ద్వారా వికెట్లు పడగొట్టేందుకు ప్రయత్నిస్తాం. భారత స్పిన్నర్లు ఎంత ప్రమాదకారులో మాకు తెలుసు. భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తూ.. భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తాం. భారత జట్టులో స్టార్లు లేకపోయినా.. మేం ఫేవరెట్స్‌ అనుకోవడం లేదు. టీమ్‌ఇండియాకు తగినంత బెంచ్‌ బలం ఉంది.

కేన్‌ విలియమ్సన్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌

తుది జట్లు (అంచనా)

భారత్‌: రహానే (కెప్టెన్‌), మయాంక్‌, గిల్‌, పుజారా, శ్రేయస్‌, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌/సూర్యకుమార్‌, సిరాజ్‌, ఇషాంత్‌/ఉమేశ్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), లాథమ్‌, విల్‌ యాంగ్‌, టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, శాంట్నర్‌/జెమీసన్‌, సౌథీ, వాగ్నర్‌, సోమర్‌విల్లె, అజాజ్‌ పటేల్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement