1983 World Cup – Kapil Heroics : భారత క్రికెట్లో చారిత్రాత్మక విజయాల ప్రస్తావన వచ్చినప్పుల్లా 1983 వరల్డ్ కప్ గుర్తుకొస్తుంది. ఆ ఏడాది కపిల్‌దేవ్(Kapil Dev) సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో డిఫెండింగ్ చాంపియిన్ వెస్టిండీస్(Westindes)ను మట్టికరిపించింది. తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది. అప్పటివరకు అనామక జట్టు అనే ముద్ర ఉన్న టీమిండియా ఆ టోర్నీతో ప్రపంచానికి తన శక్తిని చాటి చెప్పింది. ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో జింబాబ్వేపై 24 ఏళ్ల కపిల్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్(175 నాటౌట్)ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే.. అతడి ఆటకు సంబంధించిన వీడియో రికార్డు మాత్రం అందుబాటులో లేకపోవడం బాధాకరం. భారత కెప్టెన్ ఇన్నింగ్స్ రికార్డు కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? అసలు ఆరోజు ఏం జరిగిందంటే..?
భారత జట్టు ఏమాత్రం అంచనాలు లేకుండా లండన్ వెళ్లింది. లీగ్ మ్యాచుల్లో ఓటమితో ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది. ఆ తర్వాత పుంజుకున్న భారత్ అద్వితీయ ఆటతో పెద్ద జట్లకు షాకిచ్చింది. కీలకమైన సెమీఫైనల్లో కపిల్ దేవ్ మెరపు బ్యాటింగ్‌తో జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. రోయల్ టన్‌బ్రిడ్జ్ వెల్స్‌లో జింబాబ్వేపై గెలవక తప్పని మ్యాచ్‌లో కపిల్‌దేవ్ బెబ్బులిలా గర్జించాడు. 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును తన సంచలన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన కపిల్ ఫోర్లు, సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డు. 138 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే.. కపిల్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫుటేజీ (వీడియో రికార్డింగ్) రికార్డు కాలేదు. అందరూ అనుకుంటున్నట్టు అందుకు కారణం బీబీసీ(BBC Strike) సమ్మె కాదు. అసలు విషయం ఏంటంటే..?
1983 జూన్ 18న నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. లార్డ్స్‌లో వెస్టిండీస్ – ఆస్ట్రేలియా, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లండ్ – పాకిస్థాన్, డెర్బీలోని కౌంటీ గ్రౌండ్లో న్యూజిలాండ్ – శ్రీలంక జట్లు తలపడ్డాయి. టన్‌బ్రిడ్జ్ వెల్స్‌లో భారత్ – జింబాబ్వే మ్యాచ్ జరిగింది. ప్రపంచకప్ కవరేజీకి ఏకైక బ్రాడ్‌కాస్టర్ అయిన బీబీసీ మొదటి రెండు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసింది. భారత్-జింబాబ్వే మ్యాచ్‌ను అంతగా పట్టించుకోలేదు. అంతకుముందు మ్యాచుల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది.
వరల్డ్ కప్ ట్రోఫీతో కపిల్ దేవ్
దాంతో, భారత్ – జింబాబ్వే, న్యూజిలాండ్ – శ్రీలంక జట్లు మ్యాచ్ హైలైట్స్‌ను మాత్రమే రికార్డు చేయాలని నిర్ణయించుకుంది. దాంతో.. టీమిండియా మ్యాచ్ జరిగే స్టేడియంలో ఒక్క కెమెరా కూడా పెట్టలేదు. అయితే.. బీబీసీ నిర్లక్ష్యానికి చెంపపెట్టులా కపిల్ సేన సంచలన విజయం నమోదు చేసింది. ప్రత్యక్ష ప్రసారం లేకపోతేనేం.. కపిల్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌కు దిగ్గజ క్రికెటర్లు, వేలాది మంది అభిమానులు సాక్ష్యంగా నిలిచారు.
జింబాబ్వేపై తన ఇన్నింగ్స్ రికార్డు కాకపోవడంపై కపిల్ ఓ సందర్భంలో స్పందించాడు. మీడియా ఆ మ్యాచ్‌ను విస్మరించినా క్రికెట్ ప్రేమికుల గుండెల్లో తన ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నా ఇన్నింగ్స్ గుర్తులు లేనందుకు చింతించడం లేదు. ఇందులో పశ్చాత్తాపడడానికి ఏముంది? భారత జట్టు 1983 వరల్డ్ కప్ గెలిచింది. ఆ విషయాన్నిగుర్తుంచుకోవడం ముఖ్యం’’ అని ఈ లెజెండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘83’ సినిమా(83 Movie) తెరకెక్కింది. అందులో అతను జింబాబ్వేపై ఆడిన 175 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్‌కు ప్రత్యేక స్థానం లభించింది.