లా నూసియా(స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహై, వరల్డ్‌కప్ పసిడి విజేత సచిన్ సివాచ్ సహా 12 మంది బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇందులో ఎనిమిది మంది మహిళా బాక్సర్లు, నలుగురు పురుష బాక్సర్లు ఉన్నారు.
శనివారం జరిగిన మహిళల 75కిలోల సెమీస్ బౌట్లో లవ్లీన 5-0తో రోసి ఎక్లెస్(వేల్స్)పై ఘన విజయం సాధించింది. 54కిలోల సెమీస్‌లో ప్రీతి పవార్ 5-0తో ఆయా హమ్దీ(ఫ్రాన్స్)పై గెలిచి పూనమ్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీస్‌లో పూనమ్ 4-1తో ఇవీ జేన్ స్మిత్(ఇంగ్లండ్)పై గెలువగా, మంజురాణి(48కి), నీతు గంగాస్(51కి), ప్రియ(60కి), అరుంధతి చౌదరి(70కి), నైనా(80కి) తుదిపోరులో నిలిచారు.