న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడు కొనసాగుతున్నది. తమ తొలి మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌ను ఓడించిన ఢిల్లీ..మలి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో విజయంతో రెండోస్థానంలోకి దూసుకొచ్చింది. ముంబై నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ఇంప్యాక్ట్’ ప్లేయర్ సమీర్ రిజ్వి(51 బంతుల్లో 90, 7 ఫోర్లు, 7సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో దుమ్మురేపాడు. ముంబై బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. లీగ్‌లో వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించిన రిజ్వి కండ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు.
7 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో నిస్సనక(44), డేవిడ్మిల్లర్(21 నాటౌట్)తో కలిసి రిజ్వి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌల్ట్ గైర్హాజరీలో బలహీనంగా కనిపించిన ముంబైపై రిజ్వి తన ప్రతాపం చూపించాడు. చాహర్, సాంట్నర్, బాశ్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ముంబై 20 ఓవర్లలో 162/6 స్కోరుకు పరిమితమైంది. స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్(36 బంతుల్లో 51, 3ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా, రోహిత్‌శర్మ(35) ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా బదులుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ మినహా ముంబై బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన రిజ్వి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఢిల్లీ యువ బ్యాటర్ సమీర్ రిజ్వి..మరోమారు తన విలువ చాటుకున్నాడు. గత సీజన్లలో దాదాపు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రిజ్వి ఈసారి తన సత్తాఏంటో ప్రత్యర్థి జట్లకు రుచిచూపిస్తున్నాడు. ముంబై నిర్దేశించిన ఛేదనలో కేఎల్ రాహుల్(1), నితీశ్‌రానా(0) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరగా, ఇన్నింగ్స్ బాధ్యతను రిజ్వి తన భుజానేసుకున్నాడు. నిస్సనకతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. బౌల్ట్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కార్బిన్ బాశ్ను లక్ష్యంగా రిజ్వి రెచ్చిపోయాడు. బాశ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లకు తోడు రెండు ఫోర్లతో 20 పరుగులు పిండుకున్నాడు. లెంగ్త్ బంతిని డీప్ పాయింట్లో సిక్స్‌గా మలిచిన రిజ్వి..మరుసటి బంతిని లాంగాఫ్‌లో అంతే చాకచక్యంగా సిక్స్ కొట్టడంతో అరుణ్‌జైట్లీ స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత మాయంక్ను లక్ష్యంగా చేసుకున్న రిజ్వి సిక్స్‌తో 31 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. 23 బంతుల్లో 25 కొట్టిన రిజ్వి 8 బంతుల తేడాతో 50 పరుగులకు చేరుకున్నాడు.
ఈ క్రమంలో నిస్సనకతో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన రిజ్వి నాలుగో వికెట్‌కు మిల్లర్‌తో ఇన్నింగ్స్‌ను తారాస్థాయికి తీసుకెళ్లాడు. రిజ్విని ఔట్ చేసేందుకు కెప్టెన్ సూర్య..బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా ముందుకు సాగిన రిజ్వి..బౌండరీలతో లక్ష్యాన్ని అంతకంతకు కుదించాడు. మిల్లర్‌ను నాన్ పరిమితం చేస్తూ దూకుడుగా ఆడాడు. అయితే బాశ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రిజ్వి లాంగ్ఆఫ్లో తిలక్ క్యాచ్‌తో ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. స్టబ్స్(3 నాటౌట్)తో కలిసి మిల్లర్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై దూకుడుగా ఆడటంలో విఫలమైంది. ముకేశ్ కుమార్ మూడో ఓవర్లో ఓపెనర్ రికల్టన్(9) తొలి వికెట్‌గా వెనుదిరుగగా, రెండు బంతుల తేడాతో తిలక్‌వర్మ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు. దీంతో 18 పరుగులకే ముంబై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌శర్మ, సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లు అక్షర్‌పటేల్, కుల్దీప్యాదవ్, విప్రాజ్ నిగమ్..ముంబైని నిలువరించడంలో సఫలమయ్యారు. 3ఫోర్లు, 2 సిక్స్‌లతో సూర్య అర్ధసెంచరీ చేసినా రూథర్‌ఫర్డ్(5) ఆకట్టుకోలేకపోయాడు. నమన్ ధీర్(28), సాంట్నర్(18 నాటౌట్), బాశ్(11 నాటౌట్) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.
ముంబై: 20 ఓవర్లలో 162/6 (సూర్యకుమార్51, రోహిత్ 35, ముకేశ్ 2/26, అక్షర్ 1/22),
ఢిల్లీ: 18.1 ఓవర్లలో 164/4(రిజ్వి 90, నిస్సనక 44, చాహర్ 1/20, సాంట్నర్ 1/22)