ఢిల్లీ: భారత యువ అథ్లెట్ దేవ్‌కుమార్ మీనా మరోసారి సత్తాచాటాడు. తైవాన్‌లో జరిగిన సన్ మూన్ లేక్ పోల్‌వాల్ట్ ఇంటర్నేషనల్ మీట్లో ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు 5.40 మీటర్లు దూకి గతంలో తన పేరిటే ఉన్న రికార్డును సమం చేయడమే గాక ఈ ఈవెంట్లో కాంస్యం సాధించాడు.
ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్న దేవ్.. నిరుడు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ సందర్భంగా 5.40 మీ. ఎత్తుకు దూకి జాతీయ రికార్డు నెలకొల్పాడు. రెండేండ్ల క్రితం అంతర్జాతీయ టోర్నీల్లో అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. 5.20 మీ. నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 5.40 మీ.కు చేరి భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాడు. పోల్‌వాల్ట్‌లో ఒక్క ఏడాది వ్యవధిలోనే అతడు జాతీయ స్థాయిలో మూడు సార్లు రికార్డులు నెలకొల్పడం విశేషం. ఇదిలాఉండగా తైవాన్‌లో జరిగిన ఈవెంట్లో భాగంగా మహిళల విభాగంలో 20 ఏండ్ల నిఖిత 3.95 మీ. దూకి కాంస్యం గెలుచుకుంది.