నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:‘ఈ ఒక్క మ్యాచ్ ఓడితే ప్రపంచం ఏం మునిగిపోదు. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇది కూడా. ప్రపంచకప్ ఇప్పుడే మొదలైంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. లోపాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌లో సత్తాచాటుతాం’ పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న మాటలివి. వారం రోజుల విశ్రాంతి అనంతరం అదే మైదానంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న భారత జట్టు ఆటతీరులో మాత్రం ఏ మార్పు కనిపించలేదు. సరైన సన్నద్ధత లేకుండా బరిలోకి దిగారా?? అంటే అదీ కాదు.. ఆటగాళ్లందరికీ ఐపీఎల్‌తో మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది! పరిస్థితులకు అలవాటు పడలేదా?? అంటే అదీ కాదు.. దాదాపు రెండు నెలలుగా మనవాళ్లు యూఏఈలోనే ఉన్నారు! అయినా లోపం ఎక్కడ ఉందనేది సగటు క్రీడాభిమానిని తొలిచివేస్తున్నది!!
పాక్‌తో పోరులో మిగిలినవాళ్లంతా పెద్దగా ప్రభావం చూపకపోయినా.. విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో కనీసం పోరాడే స్కోరు చేసిన భారత్.. కివీస్‌తో పోరులో మరీ గల్లీ టీమ్‌ను తలపించింది. ఎప్పుడెప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుదామా అన్నట్లు మనవాళ్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. షాహీన్ షా అఫ్రిది తరహాలోనే భారత టాపార్డర్‌ను కూలుస్తానన్న బౌల్ట్.. తన మాటలు నిజం చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు బదులు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా దింపడమే భారత మేనేజ్మెంట్ మైండ్‌సెట్‌ను స్పష్టం చేసింది. పవర్‌ప్లేలో ధాటిగా ఆడగలడనే ఉద్దేశంతో అతడిని బరిలోకి దింపినా.. ఇది ప్రత్యర్థికి తప్పుడు సంకేతలిచ్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
మూడో ఓవర్లో ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. కాసేపటికే రాహుల్, రోహిత్, విరాట్ కూడా పెవిలియన్ చేరిపోయారు. ఈ నలుగురు క్యాచౌట్ కావడం గమనార్హం. ఐపీఎల్లో భారీ సిక్సర్లతో విజృంభించే మనవాళ్లు.. అసలు పోరులో మాత్రం బౌండ్రీ హద్దుల్లో కివీస్ ఫీల్డర్లకు క్యాచింగ్ ప్రాక్టీస్ చేయించారు. హార్డ్ హిట్టర్లుగా గుర్తింపు ఉన్న రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా భారీ షాట్లు ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడగా.. కాస్తలో కాస్త రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‌లో డెప్త్ పెంచేందుకు జట్టులోకి తీసుకున్న శార్దూల్ ఠాకూర్ ఇలా వచ్చి అలా వెళ్లగా.. బౌలింగ్‌లో మనవాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు చెరిగిన చోట.. మనవాళ్లు రెండు వికెట్లతో సరిపెట్టుకున్నారు!