శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Feb 11, 2021 , 00:19:46

సింగరాయ జాతరెళ్దాం

సింగరాయ జాతరెళ్దాం

  • జాతరకు ప్రతాపరుద్ర లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం సిద్ధం
  • లక్షకు పైగా తరలిరానున్న భక్తజనం
  • ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగనున్న ఉత్సవం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన పంచాయతీ పాలకవర్గం
  • వైభవంగా పుల్లూరు జాతర ప్రారంభం
  • నమో నారాయణ..

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 10 : సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతర బుధవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను గ్రామస్తులంతా కలిసి బండపైకి తరలించే రథోత్సవం పూర్తయ్యింది. రథోత్సవానికి దారి పొడవునా గ్రామస్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ రథోత్సవంలో కళాకారుడు ప్రసాద్‌ కళాబృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

కోహెడ, ఫిబ్రవరి 10 : కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి గాంచిన ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నర్సింహస్వామి జాతర గురువారం జరుగనున్నది. కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులోని సింగరాయ లొద్దిలో ఉన్న సింగారయ గుట్టల్లో వెలసిన స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తజనం తరలిరానున్నది. గుట్టల మధ్య అలరారే ప్రకృతి సోయగాల మధ్య జాతర జరుగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కేవలం రోజంతా ప్రకృతి అందాల మధ్య విహార యాత్రను తలపించేలా జాతర జరుగుతుంది. జాతరకు మహారాష్ట్రలోని ముంబై, భీవండి, నాగ్‌పూర్‌, పూణె నగరాల నుంచే కాక, రాష్ట్రంలోని మెదక్‌, వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు భక్తజనం తరలిరానుంది.

ప్రకృతి అందాల మధ్య..


చుట్టూ గుట్టలు.. మధ్యన మోయతుమ్మెద జలగలగలలు.. పక్షుల కిలకిల రావాలు.. నెమళ్లు, కుందేళ్ల కదలికలు.. ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణం జాతర ప్రత్యేకత. తూర్పు నుంచి పడమరకు ప్రవహించే నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని తలంచి సింగరాయ అనే ఇంజినీరును పంపగా, అతను ఇక్కడి ప్రకృతి దృశ్యాలకు ముగ్ధుడై, ఇక్కడే ఉండిపోయినట్లు కథ ప్రచారంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం, రేణుకా ఎల్లమ్మ ఆలయం, పంచముఖ హనుమాన్‌, లైమ్‌స్టోన్‌తో చెక్కిన పంచముఖ బ్రహ్మ విగ్రహాలతోపాటు కొండపై గుహలో వెలసిన లక్ష్మీనర్సింహుల ఆలయం ఉంది. భక్తులు నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం చెట్లకింద వంటలు చేసుకొని సకుటుంబ సమేతంగా భోజనాలు చేసి రోజంతా సేదతీరుతారు. చిక్కుడు కాయ, వంకాయ, టమాట, పచ్చిమిర్చితో కూడిన భోజనాలు చేస్తారు. వచ్చే దారిలో గాజుల బండపై ఏర్పాటయ్యే దుకాణాల్లో తినుబండారాలు, ఆటబొమ్మలు కొనుగోలు చేస్తారు. మందుమాంసం ఆనవాళ్లు జాతరలో కనిపించవు. రాత్రయితే స్వామివారికి తలనొప్పి వస్తుందని భక్తులు ఇంటిదారి పడుతుంటారు.

జాతరకు ఏర్పాట్లు పూర్తి

సింగరాయ జాతరకు ఏర్పాట్లుపూర్తి చేసినట్లు కూరెల్ల గ్రామ సర్పంచ్‌ గాజుల రమేశ్‌ తెలిపారు. ఈ యేడు వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేశారన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌, సీఐ రఘుపతిరెడ్డిలు జాతర స్థలాన్ని సందర్శించి చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

VIDEOS

logo