బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 07, 2020 , 00:35:29

ప్రజా నాయకుడు...

ప్రజా నాయకుడు...

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండేవారు. ఆయన మరణాన్ని నియోజకవర్గ ప్రజలు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన జీవితం మొత్తం అనూహ్యం, సంచలనాలే. ఎవరి ఊహకు అందని విధంగా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో అక్టోబర్‌ 2, 1962లో సోలిపేట రామకృష్ణారెడ్డి-మాణిక్యమ్మ దంపతులకు చివరి సంతానంగా సోలిపేట రామలింగారెడ్డి జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్లు. చిట్టాపూర్‌, లచ్చపేట, ధర్మాజిపేట, మిరుదొడ్డిలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం కొనసాగించారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. నాడు ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ సమక్షంలో సుజాతతో ఆదర్శ వివాహం చేసుకున్నారు. సోలిపేటకు కుమారుడు సతీశ్‌రెడ్డి, కుమార్తె ఉదయ ఉన్నారు. దుబ్బాక అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశారు. కార్యకర్తలకు అండగా నిలిచారు. దుబ్బాక నియోజకవర్గంలో చిన్నా, పెద్దలు పిలిస్తే పలికే లింగన్నగా ప్రజల గుండెల్లో కొలువుతీరారు. లింగన్న భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో శాశ్వతంగా జీవించి ఉంటారు.

సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటు...

సీఎం కేసీఆర్‌కు సోలిపేట రామలింగారెడ్డి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయలేదు. నా చేతిలో చిల్లగవ్వ లేకున్నా నన్ను పిలిచి దొమ్మాట ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి ఇంతవాణ్ణి చేశాడు మా నాయకుడు కేసీఆర్‌ అని రామలింగారెడ్డి తరుచూ చెబుతుండేవారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ అయ్యానంటే అది సీఎం కేసీఆర్‌ చలువే అని ఆయన అనేవారు. ఎప్పుడూ నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు.  

సోలిపేట రామలింగారెడ్డి విద్యార్థి దశ నుంచి విప్లవాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. స్వగ్రామామైన చిట్టాపూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం ధర్మాజీపేట, లచ్చపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. 1979లో దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రారంభమైంది. ఆ సమయంలో (మొదటి సారి) ఇంటర్మీడియట్‌ విద్యావకాశం పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. డొనేషన్‌ చెల్లించిన విద్యార్థులకే సీట్లు కేటాయించారు. దీనిని వ్యతిరేకించిన రామలింగారెడ్డి,ఆయన మిత్రులతో కలిసి గోడలపై డొనేషన్‌ చదువులు వద్దంటూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చారు. దీంతో డొనేషన్‌ రద్దు చేసి ప్రతిభ గల విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మావో, లెనిన్‌ విప్లవకారుల జీవిత చరిత్రలు పఠించటం రామలింగారెడ్డికి ఎంతగానో ఆసక్తి. పోరాటం, సాహిత్యంపై ఉన్న ఆసక్తి ఆయనను ఉద్యమాల వైపు అడుగులు వేయించింది. ఇంటర్‌ చదువుతున్న సమయంలో పీడీఎస్‌యూ, రాడికల్స్‌ సంఘాలతో సంబంధాలు పెట్టుకున్నారు. జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం  సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏలో చేరారు. మొదటి సంవత్సరంలో పూర్తిగా విప్లవ పార్టీలపై దృష్టి మళ్ల్లించారు.

ఎన్నో ఆటుపోట్లు ...

దొరలు, పెత్తందారుల పోకడలు, నియంతృత్వాలతో సామాన్యుల కష్టాలను కండ్ల నిండా చూసిన సోలిపేట రామలింగారెడ్డికి, చిన్నతనంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మక్కువ లేకుండా చేసింది. తండ్రి పోలీస్‌ పటేల్‌ అయినా అతడిలో మాత్రం మానవతా లక్షణాలే కనిపించాయి. పోలీసులు, అధికారులు మేమున్నామని చెబుతున్నా... ఆచరణలో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగానే మారింది. దీంతో రామలింగారెడ్డి మనసు విప్లవ పోరాటాల వైపు మళ్లింది. ఈ పోరాటాల ముళ్లబాటలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)లో చేరి సమాజానికి ఏదో చేస్తామనే ఆకాంక్షతో విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. అప్పట్లో గ్రామాల్లో జమీందారులు, భూస్వాములు, పెత్తందారులు, పటేల్‌దారీ, పట్వారీ వ్యవస్థకు, పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు.   

జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే వరకు సోలిపేట ప్రస్థానం... 

25 ఏండ్లుగా జర్నలిస్టుగా పనిచేసి 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు సోలిపేట రామలింగారెడ్డి. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యే వరకు సోలిపేట రామలింగారెడ్డి ప్రస్థానం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఐదుసార్లు పోటీచేసి నాలుగు సార్లు విజయం సాధించారు. వరుసగా 2 సార్లు శాసనసభా అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2004 సాధారణ ఎన్నికల్లో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక ) టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డిపై 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 6వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో నూతనంగా ఏర్పడ్డ దుబ్బాక నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేశారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసిన సోలిపేట రామలింగారెడ్డ్డి, సమీప ప్రత్యరి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఉన్న రామలింగారెడ్డికి, వరుసగా రెండు సార్లు శాసనసభా అంచనాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. రామలింగారెడ్డి రాజకీయ జీవితంలో ఒకే ఒకసారి 2009 ఎన్నికల్లో అపజయం మినహా, మిగిలిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించారు. గత శాసనసభ ఎన్నికల్లో సిద్దిపేట సభలో మంత్రి హరీశ్‌రావును, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని జోడు గుర్రాలుగా సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు.

ఆదర్శ వివాహం...

1985లో కాళోజీ నారాయణ పెండ్లి పెద్దగా, అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా, నందిని సిద్దారెడ్డి తదితర మేధావుల సమక్షంలోనే సోలిపేట రామలింగారెడ్డి, సుజాతను (స్టేజీ మ్యారేజీ )ఆదర్శ వివాహం చేసుకున్నారు. తనలాగే తన కొడుకు సతీశ్‌రెడ్డి, కూతురు ఉదయశ్రీలకు సైతం స్టేజీ మ్యారేజ్‌ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. తాను చేరదీసిన అనాథలకు ఆదర్శ వివాహాలు జరిపించారు. దుబ్బాక మండలంలోని చిట్టాపూర్‌కు చెందిన రేఖ అనే అమ్మాయి 17వ ఏట తల్లిని కోల్పోయింది. తండ్రి రేఖను అమ్మేయాలని ప్రయత్నించగా, ఎమ్మెల్యే రామలింగారెడ్డిని ఆశ్రయించింది. దీంతో ఆమెను ఉన్నత చదువులు చదివించగా, ప్రస్తుతం ఆమె ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేశ్‌ను ఆమె ప్రేమించగా, ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదర్శ వివాహం జరిపించి, సొంత డబ్బులతో అన్ని సౌకర్యాలు కల్పించి అత్తగారింటికి సాగనంపారు. మిరుదొడ్డి మండలం కూడవెల్లికి చెందిన అనాథ యువతి లక్ష్మికి ఆదర్శ వివాహం జరిపించారు. ఈ విధంగా ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు. 25 మందికి పైగా అనాథలను ఆదరించి ప్రయోజకులను చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొదటి నుంచి ఆదర్శ వివాహాలనే ప్రోత్సహించారు. 

సోలిపేటపై ‘టాడా’ కేసు నమోదు... 

పోలీసుల అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామలింగారెడ్డిపై ఆయుధాలు ఉన్నాయనే నేపంతో దేశంలోనే తొలిసారి జర్నలిస్టుపై ‘టాడా’ కేసు నమోదు చేయడం నాడు దేశంలోనే సంచలనం సృష్టించింది. పోలీసుల దుశ్చర్యను జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం సైతం తీవ్రంగా ఖండించాయి. కేసు మూలంగా 3 మాసాలు జైల్లో ఉన్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్డులో కేసును కొట్టివేసింది. 

దుబ్బాక అభివృద్ధిలో తనదైన ముద్ర... 

దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి నిరంతరం ప్రజా సేవలో ఉండే గొప్పవారు సోలిపేట రామలింగారెడ్డి. సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పింఛన్లు అందించారు. చేనేత రంగానికి పునర్జీవం తీసుకువచ్చారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం దుబ్బాక సెగ్మెంట్‌లోనే చేపట్టారు. దుబ్బాక పట్టణంలోనే 1250కి పైగా ఇంట్లు ఒకేచోట నిర్మించారు. కొత్తగా రహదారులు, బ్రిడ్జిలు,  మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తెచ్చారు. సామాజిక భవనాలు, సీఎం కేసీఆర్‌ చదివిన బడిని సరికొత్త హంగులతో నిర్మాణం చేపట్టారు. దుబ్బాకలో ఉన్నత విద్యనందించేందుకు తనవంతుగా కృషి చేశారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు  గుణాత్మక విద్యనందించేందుకు ఎమ్మెల్యే సోలిపేట ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు కళాశాలకు నిధులు సమకూర్చేందుకు 2017లో ‘బెనిఫిట్‌ షో’ నిర్వహించారు. కార్యక్రమం ద్వారా రూ.15 లక్షలు పోగు చేసి అభివృద్ధి కమిటీ పేరిట కలెక్టర్‌కు అందజేశారు. విద్య, వైద్యం, రైతుల సంక్షేమానికి కృషి చేశారు. నియోజకవర్గ కేంద్రంలో రామసముద్రం చెరువును సుందరీకరించారు. చెరువులో బోటు సదుపాయం ఏర్పాటు చేసి, సాయంత్రం వేళ దుబ్బాక పట్టణ ప్రజలు సేదతీరేలా రామసముద్రం చెరువు పునరుద్ధరించారు. మల్లన్న సాగర్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషిచేశారు. 


logo