ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - May 31, 2020 , 01:58:30

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచండి‌: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచండి‌: ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

  • అధికారులతో సమీక్ష

హుస్నాబాద్‌: గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచాలని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో హుస్నాబాద్‌ ఉమ్మడి మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌పై సమీక్ష నిర్వహించగా, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ హాజరయ్యారు. సమీక్షలో రిజర్వాయర్‌ పనులపై చర్చించారు. పనుల పురోగతి మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి హుస్నాబాద్‌ ప్రాంత రైతుల ఆకాం క్షలు నెరవేర్చాలని సతీశ్‌కుమార్‌ కోరారు. రూ.583.277కోట్లతో చేపట్టిన రిజర్వాయర్‌ పనుల్లో ఇప్పటి వరకు 493.91కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ రిజర్వాయర్‌ పాత, కొత్త పనుల కోసం రూ.583.27 కోట్ల అంచనాలతో చేపడుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

ఇప్పటికే 493.91కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన 112.65లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 24281క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, 165721క్యూబిక్‌ మీటర్ల రివిట్మెంట్‌ పనులు, 134841క్యూబిక్‌ మీటర్ల రాక్‌టో పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు మంత్రికి వివరించగా, మిగతా పనులు వేగంగా పూర్తి చేయాల ని మంత్రి ఆదేశించారు. సర్జిపూల్‌, పంప్‌హౌస్‌, కెనాల్స్‌ పనులు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. టన్నెల్‌ లైనింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. పంపుల బిగింపు పనులు త్వరితగతిన పూర్తి చేసి, రిజర్వాయర్‌లోకి నీళ్లు నింపేలా ప్రణాళికలాబద్ధంగా పనులు నిర్వహించా లని మంత్రి సూచించారు. రానున్న వర్షాకాలంలోను పనులు ఆగకుండా చూడాలన్నారు. రిజర్వాయర్‌ పనులకు అవసరమైన నిధులు సమకూర్చు తామని, పనుల్లో జాప్యం సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాగే నిర్వాసితులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి జాప్యం చేయొద్దన్నారు. భూములు కోల్పోయే రైతులు, స్థానిక ప్రజలు పరిహారం తీసుకొని స్వచ్ఛందంగా రిజర్వాయర్‌ పనులకు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.


logo