శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 00:24:26

నిర్లక్ష్యానికి భారీ మూల్యం

నిర్లక్ష్యానికి భారీ మూల్యం

సిద్దిపేట టౌన్‌  : మితిమీరిన వేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యంతోనే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. రోడ్డు విశాలంగా ఉందని అతివేగంతో వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. సమయం లేదని కొందరు, సమయమున్నా ముందు బయల్దేరక మరికొందరు అతివేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడి వారి కుటుంబాల్లో తీరని శోకం మిగులుస్తున్నారు. ట్రాఫిక్‌, రహదారి నిబంధనలు పాటించక చాలామంది కష్టాలపాలవుతున్నారు. ఎవరో చేసిన తప్పులకు ఇంకొందరు బలవ్వడమే కాకుండా క్షతగాత్రులుగా జీవితాంతం తీరని బాధను అనుభవిస్తున్నారు. దీని నివారణకు కావాల్సింది కేవలం చైతన్యమే. నిబంధనలు పాటించడమే. ఎవరికి వారు స్వీయ నియంత్రణ చేసుకోవడమే ఉత్తమం. రహదారి ప్రమాదాలు నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతియేటా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుండగా జిల్లాలో గత నెల 27 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా జోరుగా వారోత్సవాలు నిర్వహిస్తున్న రవాణాశాఖ విద్యార్థులు, యువతకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో వారోత్సవాల ఉద్దేశం ? రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల్లో అవగాహన ఎలా కల్పిస్తున్నారు ? ప్రమాదాల నియంత్రణకు యువతలో మార్పు తెచ్చే మార్గాలెంటి ? శాఖాపరంగా ప్రణాళికలు ఎలా ఉన్నాయి? తదితరాంశాలపై జిల్లా రవాణాశాఖాధికారి రామేశ్వర్‌రెడ్డితో ‘నమస్తేతెలంగాణ’ ముఖాముఖి.. 


నమస్తే తెలంగాణ : జిల్లాలో రోడ్డు భద్రత 

వారోత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి?

డీటీవో రామేశ్వర్‌రెడ్డి : రోడ్డు భద్రత అందరి బాధ్యత అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. జిల్లా వ్యాప్తంగా యేటా భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు డ్రైవర్లకు ఉచిత హెల్త్‌ చెకప్‌తో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించాం. పోలీసు, రవాణా శాఖ సంయుక్తంగా సిద్దిపేట, గజ్వేల్‌లో అవగాహన సదస్సులు నిర్వహించింది. వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు ముందుకెళ్తున్నాం.


మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా 

జరుగుతున్నాయి.. వీటి నివారణకు ఎలాంటి చర్యలు 

తీసుకుంటున్నారు? 

అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపడంతో వాహనదారులు కోరి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. యేటా దేశ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో 16ఏండ్ల నుంచి 35 ఏండ్ల వయస్సు గల యువతే ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి నివారణకు ఈ ఏడాది ప్రత్యేకంగా యువతలో మార్పు వచ్చేలా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఈ సంఖ్యను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.

గతేడాదితో పోల్చితే ప్రమాదాల సంఖ్య తగ్గిందా?

రోడ్డు భద్రతా వారోత్సవాల్లోనే కాకుండా సమయం చిక్కినప్పుడల్లా యువత, విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని గుర్తించి, గతేది కంటే ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు పెంచి, ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నాం. గతంలో కంటే వాహనదారుల్లో అవగాహన వచ్చింది. కొంత మేర ప్రమాదాల సంఖ్య తగ్గింది.


ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు

తీసుకుంటున్నారు?

తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల స్పాట్లను ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నది. ప్రమాదాలు జరుగడానికి గల కారణాలు గుర్తించి అక్కడ రేడియం కోన్‌, స్టాఫర్స్‌, బోర్డ్స్‌ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా ప్రమాద స్పాట్లను ముందుగానే గుర్తించే విధంగా మ్యాప్‌లను ముందుగానే ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాద స్పాట్ల వద్ద ప్రజలకు, వాహనదారులకు తరచూ అవగాహన కల్పిస్తున్నాం.

హెల్మెట్‌, సీటు బెల్టుపై ఎలా అవగాహన కల్పిస్తున్నారు? 

హెల్మెట్‌, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడిపే వారిని గుర్తిస్తున్నాం. ‘హెల్మెట్‌ బరువు కాదు.. బాధ్యత’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. వాహనాలు నడిపే వారందరూ సీటు బెల్టు, హెల్మెట్‌ ధరించేలా చూస్తున్నాం. వినూత్నంగా గులాబీపూలు ఇచ్చి అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాహనదారుల్లో మార్పు వస్తున్నది. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వారిని గుర్తించి, జరిమానాలు విధిస్తున్నాం. అయినా మార్పు రాకపోతే, వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాం.

మద్యం తాగి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపి ప్రమాదాలకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతున్నది? వారిలో మార్పు తెచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? 


మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిని ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం. వారిలో మార్పు తెచ్చేందుకు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వివరిస్తున్నాం. ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబం రోడ్డు పాలవుతుంది. మద్యం తాగి, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడుపడం ప్రాణాలతో చెలగాటమాడడమేనని సూచిస్తున్నాం. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. రాజీవ్‌ రహదారిపై ప్రత్యేకంగా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారిని గుర్తించేందుకు స్పీడ్‌ లేజర్‌ గన్లను వినియోగిస్తున్నాం.

రోడ్డు భద్రతా వారోత్సవాల్లో 

వాహనదారులకు ఏం చెప్పదల్చుకున్నారు?

వాహనదారులందరూ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించి గమ్యస్థానాలకు చేరాలి. అందుకు రవాణా శాఖ ప్రత్యేకంగా రోడ్డు నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దు. వాటితో ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. మద్యం, ఓవర్‌ లోడ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ద్వారా ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నాం. యువత మార్పుతోనే ప్రమాదాల నివారణ సాధ్యం. భవిష్యత్‌ తరాలు ప్రమాదరహితంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజలందరూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి. యేటా వాహనదారులకు రవాణా శాఖ ఇదే చెబుతూ వస్తున్నది.


logo