మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:37:18

రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి
  • యాసంగి సాగుకు పెట్టుబడి సాయం విడుదల
  • -ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • నీటిని వృథా చేయవద్దు
  • ఫిబ్రవరి నెలాఖరుకల్లా కాల్వల ద్వారా సాగునీరు

నంగునూరు : రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నంగునూరు మండలంలోని నర్మెట, ఖానాపూర్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.339 కోట్ల నిధులను సమకూర్చుతుందన్నారు. యాసంగి రెండో పంటకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. రైతులు ఈ సారి బాగా పంటలు సాగు చేయడం సంతోషకరమన్నారు. దారి వెంట ఎక్కడ చూసిన పచ్చని పొలాలతో సిద్దిపేట ప్రాంతం కలకలలాడుతుందన్నారు. రైతుబంధు డబ్బులు సకాలంలో ఇవ్వడం, రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరాతో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. రైతులు నీటిని అవసరం మేరకు వాడుకోవాలని, ఆటోమెటిక్‌ స్టార్టర్లు పెట్టి వృథా చేయవద్దన్నారు. వ చ్చే ఫిబ్రవరి కల్లా కా ళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయకసాగర్‌ నుంచి కాల్వలతో నీరు తెచ్చి గ్రామాల్లో అన్ని చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 


స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కృషి 

స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. స్వచ్ఛ గ్రామాల నిర్మాణం కోసం ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంప్‌ యార్డుల నిర్మాణంతో పాటు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా గ్రామానికొక ట్రాక్టర్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి డంప్‌ యార్డుకు తరలించాలన్నారు. 


నర్మెట హైస్కూల్‌ పనితీరు భేష్‌ 

మండలంలోని నర్మెట పాఠశాల పనితీరు విధానంలో ముందుందని, ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. గ్రామానికి చెందిన పురమాండ్ల సంజీవరెడ్డి, ఐటీ కంపెనీ డైరెక్టర్‌ శాంతకుమారి సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఇఫామ్‌ ఐటీ కంపెనీ సహకారంతో నిర్మాణన్‌ సంస్థ సమకూర్చిన రూ.16 లక్షలతో చేపట్టిన డిజిటల్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌, 5 కేవీ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కంప్యూటర్‌ ఫ్యాకల్టీని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా విద్యార్థులకు అప్పలాయచెరువు గ్రామానికి చెందిన నాయిని శ్రీకాంత్‌రెడ్డి సహకారంతో స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు, బాల వికాస సహకారంతో ఏర్పాటు చేసిన ఫిజికల్‌, గణితం ల్యాబ్‌లను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో డంప్‌ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖానాపూర్‌లో విలేజ్‌ పంక్షన్‌ హాల్‌, డంప్‌ యార్డు, శ్మశాన వాటిక, సామూహిక గొర్రెల షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, సర్పంచులు ఎండీ అజీజ్‌, సత్తవ్వ, ఎంపీటీసీ బాబు, నాయకులు వెంకట్‌రెడ్డి, డి.మల్లయ్య, రవీందర్‌రెడ్డి, నారాయణ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.


logo